ఎర్ర చందనం స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న కాస్ట్ లీ కార్లను సంవత్సరాల పాటు అనధికారికంగా వాడుకున్న ఐఏఎస్ లు వాటిని ఇప్పుడు వెనక్కు ఇచ్చేశారు. ప్రభుత్వాన్ని నడిపించే కీలక స్థానాల్లో ఉండే ఐఏఎస్ లు ఎంత బాధ్యతతో ఉండాలి. కానీ బాధ్యతతో వ్యవహరించాల్సిన ఐఏఎస్ లే దారి తప్పి ఎర్రచందనం స్మగర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఖరీదు అయిన కార్లను సొంత అవసరాల కోసం వాడుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఇద్దరు ఐఏఎస్ లు ఈ పని చేశారు. ఒకరు అయితే హైదరాబాద్ లో ఉంటున్న తన భార్య కోసం స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న బిఎండబ్ల్యూ కారు ను పంపారు. ఆమె చాలా కాలం పాటు స్మగ్లర్ కు చెందిన ఈ ఖరీదు అయిన బిఎండబ్ల్యూ కారు లో షికారు చేశారు. ఈ విషయాన్ని తొలుత తెలుగు గేట్ వే. కామ్ వెలుగులోకి తెచ్చింది. ఇది ప్రభుత్వ వర్గాలతో పాటు ఐఏఎస్ ల్లో కూడా కలకలం రేపింది. తర్వాత జరిగిన పరిణామాల్లో ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న కార్లు అధికారులు సొంతానికి వాడుకుంటున్న అంశంపై అటవీ శాఖ అధికారుల నుంచి నివేదిక కోరారు. అంతే...ఈ వార్త మీడియా లో వచ్చిందో లేదో వెంటనే ఈ కార్లను ఉపయోగిస్తున్న ఐఏఎస్ లు ఈ దొంగ కార్లను వెంటనే అటవీ శాఖకు సరెండర్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఎర్రచందం స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న రెండు బిఎండబ్ల్యూ కార్లు ఇప్పుడు అటవీ శాఖ చేతికి అందాయి. అయితే బిఎండబ్ల్యూ కార్లు వాడిన వాళ్లలో ఒకరు ఏకంగా సిఎస్ కుటుంబ సభ్యులు కావటంతో ప్రభుత్వం ఈ విషయాన్ని చూసీచూడనట్లు వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు చెపుతున్నారు. మరో కారు ను అటవీ శాఖ ఉన్నతాధికారులే ఉపయోగించారు. కాకపోతే మొత్తానికి ఇప్పుడు రెండు ఖరీదు అయిన కార్లు మాత్రం వెనక్కి వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు ధ్రువీకరించాయి. ప్రస్తుతం అత్యంత కీలక స్థానంలో ఉండి...గతంలో అటవీ శాఖలో పని చేసిన ఆ ఐఏఎస్ అధికారి చేసిన పనులు చాలా చీప్ గా ఉన్నాయనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. తన ఇంట్లో పని వాళ్ళను కూడా అటవీ శాఖ నుంచి తెప్పించుకుని ప్రభుత్వం తరపున జీతాలు ఇప్పిస్తున్నట్లు ఐఏఎస్ అధికార్లులు చెపుతున్నారు. ఈ ఎర్ర చందనపు దొంగల కార్లు వెనక్కి రావటంతో ఇక ఈ కేసు క్లోజ్ అయినట్లే అని భావిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల స్కాం లకు సహకరించిన అధికారులనే ఏ మాత్రం టచ్ చేయటం లేదు..ఏదో ఎర్రచందనం స్మగ్లర్ల కార్లు వాడుకుంటే ఆ మాత్రం దానికే యాక్షన్ తీసుకుంటుందా అని ఐఏఎస్ లే సందేహం వ్యక్తం చేస్తున్నారు.