'గాడ్ ఫాద‌ర్ ' ఈవెంట్ పై వైసీపీ ప్ర‌త్యేక ప్రేమ ఏమిటో?!

Update: 2022-09-26 07:08 GMT

Full Viewఏపీలోని అధికార వైసీపీ మెగాస్టార్ చిరంజీవిని దువ్వేందుకు ప్ర‌య‌త్నం చేస్తుందా?. అంటే గ‌త కొన్ని రోజులుగా ప‌రిణామాలు ఈ దిశ‌గానే సాగుతున్నాయి. మాజీ మంత్రి పేర్ని నాని ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తూనే చిరంజీవిపై ప్ర‌శంస‌లు కురిపించ‌టం..ఏకంగా చిరంజీవికి ప‌వ‌న్ కళ్యాణ్ వెన్నుపోటు పోడిచారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా వైసీపీలో కీల‌క నేత‌గా ఉన్న విజ‌య‌సాయిరెడ్డి చేసిన ట్వీట్ కూడా రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌కు కార‌ణ‌మ‌వుతోంది. 'మెగాస్టార్ చిరంజీవి గారి సందేశాత్మక చిత్రం 'గాడ్ ఫాదర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రాలో చేస్తుండటం సంతోషకరం. ఆయనకు నా శుభాకాంక్షలు. నాలుగున్నర దశాబ్దాలుగా చిత్రసీమను రంజిపజేస్తున్న మెగా స్టార్ లో అదే ఉత్సాహం...అయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం.' అంటూ పేర్కొన్నారు.

చిరంజీవిపై ఈ ప్ర‌త్యేక ప్రేమ‌కు కార‌ణం ఏమిటో అన్న చ‌ర్చ సాగుతోంది. ఏపీలో ప‌లు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జ‌రుగుతుంటాయి. ఇందులో ప్ర‌త్యేక‌త ఏమీ లేదు. ఆదివారం నాడే మ‌రో ప్ర‌ముఖ హీరో నాగార్జున ఘోస్ట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా క‌ర్నూలులో జ‌రిగింది. దీని గురించి మాత్రం విజ‌య‌సాయిరెడ్డి ఎక్క‌డా ట్వీటిన‌ట్లు..మాట్లాడిన‌ట్లు దాఖ‌లాలు లేవు. కానీ సెప్టెంబ‌ర్ 28న అనంత‌పురంలో జ‌ర‌గ‌నున్న గాడ్ ఫాద‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ప్ర‌త్యేకంగా ట్వీట్ చేయ‌టం అన్న‌ది రాజ‌కీయ చ‌ర్చ‌కు కార‌ణ‌మైంది. వాస్త‌వానికి నాగార్జున వైఎస్ జామానా నుంచి కూడా ఆ ఫ్యామిలీతోనే స‌న్నిహితంగా ఉంటూ వ‌స్తున్నారు. త‌మ వైపు ఉన్న నాగార్జున ఈవెంట్ నిర్వ‌హిస్తే ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా..చిరంజీవి కార్య‌క్ర‌మంపై ప్రేమ చూపించ‌టం ఆస‌క్తిక‌ర ప‌రిణామంగా మారింది. ఇది అంతా కూడా చిరంజీవి అభిమానుల‌ను త‌మ వైపు తిప్పుకోవ‌టం..లేదంటే అభిమానుల్లో గంద‌ర‌గోళం క్రియేట్ అన్న‌ది వారి వ్యూహంగా చెబుతున్నారు.

Tags:    

Similar News