మోడీ మీటింగ్ ..ఏదో తేడాగా ఉందే!

Update: 2024-03-17 15:17 GMT

ఎన్నికల సమయంలో ఒక రాజకీయ మీటింగ్ అంటే ఎన్నో జాగ్రత్తలు అవసరం. అది కూడా దేశ ప్రధాని మోడీ వంటి నేత హాజరు అవుతున్న బహిరంగ సభ అంటే సహజంగా అందరి దృష్టి దీనిపైనే ఉంటుంది. పదేళ్ల తర్వాత తొలిసారి మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఒకే వేదిక నుంచి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. మూడు పార్టీ లు కలిపి ఉమ్మడిగా ఈ సభ నిర్వహించేందుకు పెద్ద ఎత్తున కమిటీలు కూడా వేసుకున్నాయి. కానీ ఆదివారం సాయంత్రం చిలకలూరిపేట లో ప్రజా గళం పేరుతో నిర్వహించిన సభ చూసిన తర్వాత మాత్రం ఏదో తేడా ఉంది అన్న ఫీలింగ్ కలగటం సహజం. భారీ భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయటంలో తెలుగు దేశం పార్టీ కి ఎంతో అనుభవం ఉంది. ఏర్పాట్ల విషయంలో టీడీపీ పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ లు కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో పదేళ్ల తర్వాత తొలిసారి ప్రధాని మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లు ఒకే వేదిక మీదకు వచ్చారు. ఈ సభ పై మూడు పార్టీలు భారీ అంచనాలే పెట్టుకున్నాయి. తొలి సభ ద్వారా బలమైన సంకేతం పంపాలని తలంచాయి. కానీ ఈ మీటింగ్ లో నేరుగా పాల్గొన్న వాళ్లకు ఎలా ఉందో తెలియదు కానీ.. టీవీ ల్లో చూసే వాళ్లకు మాత్రం చికాకు తెప్పించారు. ఎందుకంటే ఏకంగా ప్రధాని మోడీ మాట్లాడుతున్న సమయంలోనే పలు మార్లు మైక్ పని చేయలేదు. దీంతో మోడీ స్పీచ్ లో పలు మార్లు గ్యాప్ వచ్చింది.

                    దీనికంటే ముందు ప్రధాని మోడీ వేదిక మీదకు వచ్చిన తర్వాత ఆయనకు చంద్రబాబు సన్మానం చేస్తారు అంటే ఎవరూ శాలువా ఇవ్వలేదు...తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బొకే ఇస్తారు అని చెప్పినా చివరకు అది కూడా రాలేదు. ఇది చూసిన వాళ్ళు ఒకింత షాక్ కు గురయ్యారు అనే చెప్పాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మాత్రం ప్రధాని మోడీ కి ఒక విగ్రహం ఇచ్చి పరువు నిలిపారు అనే చెప్పాలి. మోడీ వేదిక ఎక్కిన వెంటనే అక్కడ ఉన్న నేతలను కనీసం పలకరించకుండా నేరుగా ప్రజలకు అభివాదం చేసి వెళ్లి తన కుర్చీలో కూర్చున్నారు. గతంలో మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల మధ్య కనిపించిన సఖ్యత ఈ బహిరంగ సభ లో కనిపించలేదు అనే భావన ఈ మీటింగ్ చూసిన వాళ్లకు కలుగుతుంది. కమిటీలు.ఇతర విషయాల సంగతి ఎలా ఉన్నా చిలకలూరి పేట అభ్యర్థిగా ఉన్న మాజీ మంత్రి పత్తిపాటి పుల్లా రావు అయినా ఈ సభ విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోలేదు అనే విమర్శలు పార్టీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. ఇంత పెద్ద మీటింగ్ విషయంలో ఇన్ని లోపాలు ఉండటంపై పార్టీ నాయకులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మూడు పార్టీలు కలిపి నిర్వహించిన తొలి బహిరంగ సభతో ప్రజలకు ఒక సానుకూల సంకేతం పంపాలని చూస్తే...చిలకలూరిపేట సభ మాత్రం ప్రజలకు ప్రతికూల సంకేతాలు పంపింది అనే చర్చ సాగుతోంది. ప్రధాని మోడీ కూడా కేవలం మంత్రులు అవినీతి చేశారు అంటూ విమర్శలు చేశారు కానీ...సీఎం జగన్ పై నేరుగా ఎలాంటి విమర్శలు చేయకపోవటంతో బీజేపీ విషయంలో ఏదో లెక్క తేడా ఉంది అనే అనుమానాలు టీడీపీ నేతల్లో వ్యక్తం అవుతున్నాయి. 

Tags:    

Similar News