ప్రైవేట్ ఆస్పత్రులకు వ్యాక్సిన్లు ఇవ్వొద్దు

Update: 2021-05-22 12:14 GMT

ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ

వ్యాక్సిన్లకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి తాజాగా మరో లేఖ రాశారు. ఇందులో ఆయన ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్లు వేసేందుకు అవకాశం కల్పించటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్లు ఇస్తే కేంద్రం..రాష్ట్రాలు ఇవ్వాలి కానీ..ప్రైవేట్ ఆస్పత్రులకు వ్యాక్సిన్లు ఇవ్వటం సరికాదని అన్నారు. దీని వల్ల వ్యాక్సిన్లు బ్లాక్ మార్కెట్ కు వెళుతున్నాయని పేర్కొన్నారు. సీఎం జగన్ శనివారం నాడు ప్రధాని నరేంద్రమోడీకి రాసిన లేఖలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. అందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ ఇవ్వాలన్నది మా నిర్ణయం. వ్యాక్సిన్ల కొరత వల్ల కేవలం 45ఏళ్ల పైబడిన వాళ్లకే ఇస్తున్నాం. ప్రైవేట్‌ ఆస్పత్రులకు నేరుగా వ్యాక్సిన్‌ ఇవ్వడం తప్పుడు సంకేతాలిస్తోంది. ప్రైవేట్‌ ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా వ్యాక్సిన్‌ ధరను నిర్ణయిస్తున్నాయి. కొన్ని ఆస్పత్రుల్లో రూ.2వేల నుంచి 25వేల వరకు విక్రయిస్తున్నాయి. దీని వల్ల సామాన్య ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. వ్యాక్సిన్‌ అనేది ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వాల్సిన విషయం. ఒక వైపు 45ఏళ్లు పైబడ్డ వాళ్లకే వ్యాక్సిన్‌ ఇవ్వలేకపోతున్నాం. 18 నుంచి 44 ఏళ్ల వారికి వ్యాక్సిన్‌ చేరాలంటే నెలలు పట్టేలా ఉంది.

ఈ పరిస్థితుల్లో ప్రైవేట్‌ ఆస్పత్రులకు వ్యాక్సిన్‌ ఇవ్వడం సరికాదు. దీని వల్ల సామాన్యులు వ్యాక్సిన్‌ తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ నియంత్రణ లేకపోతే వ్యాక్సిన్‌ను బ్లాక్‌ మార్కెట్‌ చేస్తారు. సరిపడా వ్యాక్సిన్‌ స్టాక్‌ ఉంటే.. ఎవరికైనా ఇవ్వొచ్చు. ఒక వైపు కొరత ఉంటే.. మరోవైపు ప్రైవేట్‌ ఆస్పత్రులకు ఎలా ఇస్తారు?. వ్యాక్సిన్‌లన్నీ కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్దే ఉండాలి. వ్యాక్సిన్‌లు బ్లాక్‌ మార్కెట్‌కు చేరకుండా కట్టడి చేయాలి '' అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. జగన్ లేఖ ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. స్వయంగా ప్రధాని మోడీనే దేశంలోని వ్యాక్సిన్ తయారీ సంస్థలు 50 శాతం వ్యాక్సిన్లను కేంద్రానికి..మిగిలిన 50 శాతాన్ని రాష్ట్రాలు..ప్రైవేట్ ఆస్పత్రులకు విక్రయించుకోవచ్చని తెలిపారు. ఇప్పుడు జగన్ ప్రైవేట్ లో వ్యాక్సిన్ల విక్రయాన్ని తీవ్రంగా తప్పుపడుతూ లేఖ రాశారు. మరి దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News