ప్రభుత్వానికి అయినా తెలుసా ఆ సంగతి!

Update: 2026-07-30 12:08 GMT

క్యాబినెట్ మంత్రులు వేరు. క్యాబినెట్ ర్యాంక్ వేరు. క్యాబినెట్ ర్యాంక్ ఉన్న వాళ్ళు అందరూ మంత్రులు కాలేరు. కానీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో మాత్రం ఎవరి ఇష్టం వాళ్ళది అన్నట్లు తయారు అయింది పరిస్థితి. ఈ మెసేజ్ చూస్తేనే క్యాబినెట్ ర్యాంక్ ను ఎలా వాడుతున్నారు అన్నది అర్ధం అవుతోంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కార్యక్రమాల కో ఆర్డినేటర్ పదవిని మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ కు ఇచ్చింది. ఆయనకు క్యాబినెట్ ర్యాంక్ హోదా కూడా కేటాయించారు. ఇంతవరకు ఎలాంటి వివాదం లేదు. ఆంధ్ర ప్రదేశ్ లోని భోగాపురం ఎయిర్ పోర్ట్ ను ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్ట్ 1 న ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. దీనికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి మరీ అట్టహాసంగా ఈ కార్యక్రమం భారీగా చేస్తోంది. అయితే సీఎం పర్యటన కో ఆర్డినేట్ చేయటం కోసం సీఎం కార్యక్రమాల కో ఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ కూడా ఇప్పటికే వైజాగ్ చేరుకున్నారు.

                            అయితే ఆయన టూర్ కు సంబంధించి విజయవాడ తో పాటు విజయనగరం, విశాఖపట్నం జిల్లా అధికారులకు ఆయన పేషీ పంపిన వైర్ లెస్ మెసేజ్ లో మాత్రం పెందుర్తి వెంకటేష్ ను సీఎం కార్యక్రమాల మంత్రిగా అభివర్ణించారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో ఈ కొత్త మంత్రి ఎప్పుడు వచ్చారు అంటూ చర్చ ప్రారంభం అయింది. కొంత మంది పేషీ అధికారుల ఓవర్ యాక్షన్ వల్ల లేనిపోని సమస్యలు వస్తున్నాయి అని అధికారులు చెపుతున్నారు. పెందుర్తి వెంకటేష్ ఓఎస్డీ శాయాజీరావు పేరుతో వైర్ లెస్ మెసేజ్ వివిధ జిల్లాల అధికారులకు వెళ్ళింది. అందులోనే పెందుర్తి వెంకటేష్ ను మంత్రిగా ప్రస్తావించారు. ఇది ఒక వ్యవహారం అయితే ఆంధ్ర ప్రదేశ్ మంత్రుల పేషీల్లో కూడా కొంత మంది సిబ్బంది వ్యవహారం అడ్డగోలుగా మారింది అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News