కరోనా...కోర్టు కేసుల కారణంగా ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం గత కొంత కాలంగా పక్కన పడిపోయింది. ఈ తరుణంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఆర్టీఏ కేసులతో రాజధాని తరలింపునకు సంబంధం లేదన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పరిపాలన చేయొచ్చని వ్యాఖ్యానించారు. త్వరలోనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ నుంచి పరిపాలన చేస్తామని తెలిపారు. ఇక్కడకు త్వరలోనే ఎగ్జిక్యూటివ్ రాజధాని వస్తుందని ఎంపీ విజయసాయిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
బుధవారం విశాఖలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. విశాఖలోని పంచ గ్రామాల సమస్యపై కోర్టుకు అఫిడవిట్ ఇచ్చామని..కోర్టు అనుమతి మేరకు ఇళ్ల యజమానులకు పట్టాలిస్తామన్నారు.. సింహాచలం భూముల చుట్టూ ప్రహారీ గోడ నిర్మిస్తాం. ఏలేరు-తాండవ రిజర్వాయర్ అనుసంధానానికి రూ.500 కోట్లు మంజూరు చేయనున్నాం. విశాఖలో ప్రతి వార్డును అభివృద్ధి చేస్తామని తెలిపారు.