ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. తొలుత ఏరియల్ సర్వే ద్వారా ఆయన ప్రాజెక్టు పనులను పరిశీలించారు. తర్వాత దగ్గర ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను చూసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం జగన్ వెంట మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఉన్నారు. స్పిల్‌వే వద్ద ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని సీఎం జగన్ పరిశీలించారు. కాఫర్ డ్యాం నిర్మాణ పనులను ముఖ్యమంత్రి జగన్ పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ద్వారా నీరందిస్తామని తెలిపారు.
ఆర్థిక పరమైన అంశాలన్నీ పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. నిర్వాసితులకు న్యాయం చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. గత కొంత కాలంగా కేంద్రం, రాష్ట్రాల మధ్య పోలవరం అంచనా వ్యయం పెంపుపై వివాదం నడుస్తోంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కూడా పెంచిన అంచనాల ప్రకారమే నిధులు ఇస్తే ప్రాజెక్టు ముందుకు సాగదని పేర్కొంది. దీంతో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.