నీతిఅయోగ్ ముందుకు ప్రత్యేక హోదా..పోలవరం అంశాలు

Update: 2021-02-20 11:59 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శనివారం నాడు ప్రధాని నరేంద్రమోడీ ముందు పలు కీలక అంశాలు ప్రస్తావించారు. విభజనతో నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే పారిశ్రామికీకరణ వేగం పుంజుకుంటుందని, పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీ నుంచి వర్చువల్‌ విధానంలో జరిగిన నీతి ఆయోగ్‌ ఆరవ పాలక మండలి సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. ఏపీలో కనీసం టయర్‌-1 నగరం కూడా లేదన్నారు. ''రుణాలపై అధిక వడ్డీల భారం, విద్యుత్‌ ఖర్చులు అధికంగా ఉండడం, భూ సేకరణలో జాప్యం, అనుమతుల మంజూరులో సంక్లిష్టత, దేశంలో ఉత్పత్తి, దేశంలో తయారీ రంగానికి అవరోధంగా మారాయి. కాబట్టి వీటన్నింటిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సంప్రదింపులు, చర్చల ద్వారా సంస్కరణలు తీసుకువచ్చి ఉత్పత్తి, తయారీ రంగంలో ఉన్న అవరోధాల నుంచి గట్టెకాల్సి ఉంది' అని సీఎం జగన్‌ చెప్పారు. దీంతోపాటు మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వాలు పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ వంటి ఆర్థిక సంస్థల నుంచి తీసుకునే రుణాలకు కూడా అధిక వడ్డీ, అంటే 10 నుంచి 11 శాతం వరకు వార్షిక వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని సీఎం వివరించారు.

ప్రభుత్వ రంగ సంస్థలకే ఈ పరిస్థితి ఉంటే, ఇక ప్రైవేటు రంగం పరిస్థితి ఏమిటన్నది ఆలోచించాలన్నారు. వడ్డీ భారం మోస్తూ, ఉత్పత్తి, తయారీ రంగం ఎలా పురోగమిస్తుంది? అని సందేహాలు లేవనెత్తారు. ఈ విషయంలో ఇతర దేశాలతో ఎలా పోటీ పడగలుగుతాము? అని ప్రశ్నించారు. తయారీ రంగంలో ముందుంటున్న దేశాల్లో పరిశ్రమలకు ఇచ్చే రుణాలకు వడ్డీ రేట్లు 2 నుంచి 3 శాతానికి మించి ఉండటం లేదని గుర్తుచేశారు. విద్యుత్‌ టారిఫ్‌, కొన్ని దేశాల్లో యూనిట్‌ విద్యుత్‌ను రూ.3 కంటే తక్కువకే సరఫరా చేస్తున్నారని సీఎం జగన్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జిల్లా వాణిజ్య సంస్కరణ కార్యాచరణ ప్రణాళికకు అనుగుణంగా 229 సంస్కరణలు అమలు చేస్తోంది' అని సీఎం జగన్‌ నీతి ఆయోగ్‌ సమావేశంలో వివరించారు. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు పూర్తిగా సానుకూల పరిస్థితులు కల్పించడంతో పాటు, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంలో ఎంతో సాధించాల్సి ఉందని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

Tags:    

Similar News