వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు దాఖలు చేసిన జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై ఏపీ సీఎం జగన్ సీబీఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. జగన్ బెయిల్ పిటీషన్ రద్దు చేయాలంటూ రఘురామరాజు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సోమవారం నాడు ఈ అంశంపై సీబీఐ కోర్టులో వాదనలు జరిగాయి. తాను బెయిల్ షరతులు ఏ మాత్రం ఉల్లంఘించలేదని ...రఘురామరాజు పిటీషన్ కొట్టేయాలని కోర్టును అభ్యర్ధించారు. అసలు రఘురామ పిటీషన్ కు విచారణ అర్హత లేదన్నారు. బెయిల్ రద్దు విషయంలో థర్డ్ పార్టీలు జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందునే ఆయన సభ్యత్వం రద్దు చేయాల్సిందిగా స్పీకర్ కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
అదే సమయంలో ఎంపీపై పలు కేసులు ఉన్నాయని, బ్యాంకులను మోసం చేసిన కేసులో ఆయనపై సీబీఐ విచారణ కూడా సాగుతోందని తెలిపారు. కేవలం రాజకీయ ఉద్దేశాలతోనే పిటీషన్ దాఖలు చేశారు తప్ప..రఘురామరాజు ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదన్నారు. వ్యక్తిగత అవసరాల కోసం ఆయన న్యాయవ్యవస్థను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని కౌంటర్ లో పేర్కొన్నారు. ఈ అంశాలు అన్నీ పరిశీలించి రఘురామ దాఖలు చేసిన పిటీషన్ ను కొట్టేయాలని కోరారు. జగన్ తోపాటు సీబీఐ కూడా కౌంటర్లు దాఖలు చేయటంతోపాటు సీబీఐ కోర్టు ఈ కేసును జూన్ 14కి వాయిదా వేసింది. జగన్ తరపున ఆయన లాయర్లు సుదీర్ఘ కౌంటర్ దాఖలు చేశారు.