Full Viewప్రధాని మోడీ చంద్రబాబుకు కేవలం ఓ షేక్ హ్యాండ్ ఇచ్చి ఓ ఐదు నిమిషాలు మాట్లాడారు. దానికే అంత సంబరపడిపోవాలా?. అయినా మీరు ఆయన్ను అప్పుడు తిట్టారు కదా..ఇప్పుడు అంత పులకించిపోవటం ఏమిటీ అంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల పలు సందేహాలు లేవనెత్తారు. తిట్టిన ఆయన బాగానే ఉన్నారు..తిట్టించుకున్న ఆయన బాగానే ఉన్నారు. కానీ మధ్యలో సజ్జల మాత్రమే కుతకుతలాడుతున్నారు. అంతే కాదు..షేక్ హ్యాండ్ కే చంద్రబాబు అలా అయిపోతున్నారు..జగన్ అయితే ఏకంగా ప్రధాని మోడీతో కలసి డిన్నర్ కూడా చేశారు తెలుసా? అని ప్రశ్నించారు. అంతే కాదు..గంట పాటు పలు అంశాలపై చర్చించారన్నారు. కానీ జగన్ కు ప్రచారం ఏమీ ఇష్టం ఉండదు కాబట్టి ఇవేమీ చెప్పలేదు అంటూ ఆయన అసలు విషయం చెప్పేశారు. చంద్రబాబుకు ఓన్లీ షేక్ హ్యాక్ హ్యాండ్..జగన్ కు డిన్నర్. కేవలం దేశంలో ముగ్గురు ముఖ్యమంత్రులకే అవకాశం వస్తే అందులో జగన్ ఒకరు. చూశారా మా సత్తా అన్నట్లు ఉంది సజ్జల చెప్పిన తీరు.
సహజంగా ప్రతిపక్షం కంటే అధికార పార్టీపైనే రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై బాధ్యత ఎక్కువ ఉంటుంది. మరి మోడీతో కలసి డిన్నర్ చేసి గంట పాటు మాట్లాడిన జగన్ రాష్ట్రానికి ప్రత్యేకంగా సాధించింది ఏమైనా ఉందా అంటే ఆ వివరాలేమీ చెప్పలేదు సజ్జల. కేవలం మోడీ షేక్ హ్యాండ్ తో చంద్రబాబు పులకించిపోతున్నారు...మరి మోడీతో కలసి డిన్నర్ చేసిన జగన్ ఎంత పరవశించిపోవాలి అన్నట్లు ఉంది సజ్జల వ్యవహారం. అసలు ప్రధాని మోడీతో సమావేశం అవటమే చంద్రబాబు పులకరింతకు కారణం అయితే...జగన్ పరవశించిపోవాల్సిన పనిచేశారని చెప్పారు. మరి వీరిద్దరికీ బాగానే ఉంది కానీ..అంతిమంగా రాష్ట్రానికి..రాష్ట్ర ప్రజలకు దీని వల్ల వచ్చింది ఏమిటి అన్నదే అసలు ప్రశ్న.