ఏపీలో మంత్రులంద‌రూ మార‌రు!

Update: 2022-03-11 10:26 GMT

జ‌గ‌న్ ఫిఫ్టీ...ఫిఫ్టీ ఫార్ములాకు బ్రేక్ లు

బొత్స‌, పెద్దిరెడ్డి, బుగ్గ‌న కొన‌సాగింపున‌కు ఛాన్స్ !

వైసీపీ అధినేత, ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములాకు మంగ‌ళ‌పాడిన‌ట్లే క‌న్పిస్తోంది. 2019 ఎన్నిక‌ల్లో అప్ర‌తిహ‌త మెజారిటీతో గెలిచిన త‌ర్వాత ఆయ‌న మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ స‌మ‌యంలోనే కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు . అదేంటి అంటే రెండున్న‌ర సంవత్స‌రాలు కొంత మంది..రెండున్న‌ర సంవ‌త్స‌రాలు మ‌రికొంత మందికి మంత్రి ప‌ద‌వులు ఇస్తాన‌న్నారు. ఉమ్మ‌డి రాష్ట్ర చ‌రిత్ర‌లో ఎప్పుడూ ఇలాంటి నిర్ణ‌యాలు జ‌ర‌గ‌లేదు. అయితే క‌రోనా కార‌ణంగా త‌మ‌కు పూర్తి స్థాయిలో ప‌నిచేసే అవ‌కాశం రాలేద‌ని మంత్రులు కోర‌టంతో కొద్ది కాలం క్రితం జ‌ర‌గాల్సిన మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు బ్రేక్ ప‌డింది. ఇప్పుడు ఉగాది నాటికి విస్త‌ర‌ణ జ‌రిగే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి. అయితే సీఎం జ‌గ‌న్ ముందు చెప్పిన‌ట్లు మంత్రివ‌ర్గం నుంచి అంద‌రినీ త‌ప్పించే అవ‌కాశం లేద‌ని స‌మాచారం. కొద్ది రోజుల క్రితం మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి ఓ స‌భ‌లో మాట్లాడుతూ మంత్రివ‌ర్గంలో ప్ర‌స్తుతం ఉన్న అంద‌రిని మారుస్తార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కానీ సీఎం జ‌గ‌న్ శుక్ర‌వారం నాడు బ‌డ్జెట్ ఆమోదం కోసం నిర్వ‌హించిన మంత్రివ‌ర్గ స‌మావేశంలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు స‌మాచారం. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మంత్రులకు స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చారు.

మంత్రివర్గం నుంచి తప్పించిన వారు పార్టీ కోసం పని చెయ్యాలని జగన్ సూచించారు. పదవి నుంచి తప్పించిన వారికి జిల్లా ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించనున్నట్టు వెల్లడించారు. కొంత మంది మాత్రం మంత్రి పదవిలోనే ఉంటారని సీఎం జగన్ తెలిపారు. అయితే ప్ర‌స్తుతం కేబినెట్ లో ఉండి మంత్రులు కొన‌సాగే వారిలో బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిలు గ్యారంటీగా ఉంటార‌ని స‌మాచారం. ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డికి కూడా ఛాన్స్ లేక‌పోలేద‌ని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మిగిలిన వారు అంద‌రినీ త‌ప్పించే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. కొత్త మంత్రివ‌ర్గంలో చోటు కోసం రేసులో చాలా మంది ఉన్నార‌ని..అవ‌కాశం రానంత మాత్రాన వాళ్ళ‌ను ప‌క్క‌న పెట్టిన‌ట్లు కాద‌ని సీఎం జ‌గ‌న్ వ్యాఖ్యానించిన‌ట్లు తెలిపారు. ప్ర‌స్తుతం మంత్రులు గా ఉన్న వారు మ‌ళ్ళీ గెలిచి వ‌స్తే తిరిగి మంత్రులుగా ఉండేది కూడా మీరేన‌ని తొల‌గించ‌బోయేవారికి ఊర‌ట క‌ల్పించే వ్యాఖ్య‌లు చేశారు.

Tags:    

Similar News