ఏపీకి దెబ్బ మీద దెబ్బ పడుతున్నాయి. ఇటీవలే ఏపీన ముంచెత్తిన భారీ వర్షాలు, వరదల నుంచి ప్రజలు కోలుకోక ముందే నివర్ తుఫాను మరోసారి దారుణంగా దెబ్బతీసింది. దీని కారణంగా రాష్ట్రంలో భారీ ఎత్తున పంట నష్టం రైతులు తీవ్ర నష్టాల పాలు అయ్యారు. శుక్రవారం నాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో బాధితులకు సాయంపై నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఉదయం సీఎం జగన్ నివర్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న మూడు జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు.
ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి జగన్ గన్నవరం విమానశ్రయం నుంచి నేరుగా చిత్తూరు జిల్లాకు వెళ్ళారు. అక్కడ నుంచి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో వైఎస్ఆర్ కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వరద ప్రభావంపై సమీక్ష చేపట్టారు. తుఫాన్ ప్రభావం వల్ల జరిగిన నష్టాలపై చర్చిస్తున్నారు. వివిధ శాఖల అధికారులు నివేదికలతో సహా సమావేశానికి హాజరు అయ్యారు.