సోషల్ మీడియా ట్రోలింగ్ కు భయం.బొత్స
రేట్లు పెరగాలంటే సినిమా వాయిదా వేసుకోవాల్సింది..పేర్ని నాని
ఏపీలో సినిమా రాజకీయం నడుస్తోంది. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా చంద్రబాబు, నారా లోకేష్ లు ట్వీట్ చేయటం..పవన్ అబిమానుల నుంచి సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు రావటంతో ఏపీ మంత్రులు రంగంలోకి దిగారు. సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణతోపాటు మరో మంత్రి పేర్ని నాని కూడా ఈ అంశంపై మాట్లాడారు. సోషల్ మీడియా ట్రోలింగ్ లను చూసి తాము భయపడం అని వ్యాఖ్యానించారు బొత్స. తమ ప్రభుత్వం వ్యవస్థల కోసం పనిచేస్తుంది కానీ..వ్యక్తుల కోసం కాదన్నారు. ప్రభుత్వం నియమించిన కమిటీ టిక్కెట్ రేట్లు పెంపుపై చర్చలు జరుపుతోందని తెలిపారు. ఈ రేట్లు గిట్టుబాటు కాకపోతే సినిమా విడుదల వాయిదా వేసుకోవాల్సింది అని వ్యాఖ్యానించారు. పేర్ని నాని కూడా పెరిగిన రేట్లు అమల్లోకి రావాలంటే పలుమార్లు వాయిదా వేసిన భీమ్లానాయక్ ను మరోసారి వాయిదా వేసుకోవాల్సింది అన్నారు. మంత్రి గౌతంరెడ్డి చనిపోయినందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా వేసినట్లుగానే...సినిమాను కూడా ఓ వారం ఆపుకోలేకపోయాడా అని ప్రశ్నించారు.
మంత్రివర్గ సహచరుడు చనిపోయి తాము అంతా బాధలో ఉన్నామని..అందుకే జీవోనే జారీలో జాప్యం జరిగిందని తెలిపారు. సోమవారం నాడు కమిటీ కూర్చుని ముసాయిదా ప్రతిపాదనలు సిద్ధం చేస్తుందని తెలిపారు. న్యాయ శాఖ ఓకే అంటే త్వరలోనే జీవో విడుదల అవుతుందని తెలిపారు. చంద్రబాబునాయుడు, నారా లోకేష్ లు ఈ సినిమాపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఇలాంటి ట్వీట్లు ఎన్టీఆర్ సినిమాకు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ బావమరిది అయిన మహేష్ బాబు సినిమాలకు, ప్రభాస్ సినిమాలకు ఎప్పుడైనా చేశారా అని ప్రశ్నించారు. పవన్ పై మీకు ఎందుకింత శ్రద్ధ అని ప్రశ్నించారు. ఇది వన్ సైడ్ లవ్వా..లేక అర లవ్వా అని ప్రశ్నించారు. ప్రతి చోటా రాజకీయం చేయటం చంద్రబాబు, లోకేష్ లకు అలవాటేనన్నారు. అఖండ సినిమా అంశంపై తనతో బాలక్రిష్ణ మాట్లాడారని..సీఎం సమయం కూడా కోరారని తెలిపారు నాని. ఆ విషయం నిజమో కాదో..బాలక్రిష్ణ, చిత్ర నిర్మాతలు చెప్పాలన్నారు. తన సినిమా కోసం సీఎం జగన్ ను కలవను అని బాలక్రిష్ణ వ్యాఖ్యలు చేశారన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయం వెల్లడించారు.