Full View'నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు.' చిరంజీవి నోటి నుంచి వచ్చిన ఈ ఒక్క డైలాగ్ పెద్ద చర్చకు కారణమైంది. చిరంజీవి స్వయంగా ట్విట్టర్ లో గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించి ఈ డైలాగ్ తో కూడిన వాయిస్ ను విడుదల చేశారు. అయితే ఇది సినిమాలో డైలాగా ..లేక భవిష్యత్ లో తమ్ముడికి అండగా ఉండబోతున్నాననే సంకేతం ఇచ్చారా అనే కొత్త చర్చకు తెరతీసింది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఓ సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో జనసేనకు చిరంజీవి అండగా ఉంటారని ప్రకటించారు..దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చిరంజీవి గత కొన్ని సంవత్సరాలుగా యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉంటూ..సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. ఈ మధ్య ప్రధాని నరేంద్రమోడీ తో కలసి అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పట్లో బిజెపి చిరంజీవిని తమ వైపు తిప్పుకునే పనిలో ఉందనే వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం బిజెపితోనే పొత్తులో కొనసాగుతున్నారు. మొత్తానికి చిరంజీవి నోటి నుంచి వచ్చిన ఒక్క డైలాగ్ ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసిందనే చెప్పాలి. అయితే చిరంజీవి తాజా సినిమా ఆచార్య బాక్సాపీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో గాడ్ ఫాదర్ సినిమాపై అందరి కళ్లు ఉన్నాయి.