ఏపీ సర్కారు టాలీవుడ్ కు సినిమా చూపిస్తోంది. టిక్కెట్ల ధరల విషయంలో ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారమే విక్రయాలు సాగాలని స్పష్టం చేస్తోంది. అంతే కాదు..బెనిఫిట్ షోలు అనుమతించబోమని..ఎక్కడైనా సరే నాలుగు షోలకే అనుమతి ఇస్తున్నట్లు ఏపీ మంత్రి పేర్ని నాని తాజాగా స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రముఖ హీరో చిరంజీవి ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ కు ఓ విన్నపం చేశారు. పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానం తెచ్చేందుకు బిల్లు ప్రవేశపెట్టడం హర్షించదగ్గ పరిణామం అంటూనే టిక్కెట్ ధరల విషయంలో మాత్రం మార్పులు చేయాలని కోరారు.
'టికెట్ల ధర విషయంలో ఏపీ ప్రభుత్వం పునరాలోచించాలి. దేశమంతా ఒకటే జీఎస్టీ గా పన్నులు తీసుకుంటున్నారు. టిక్కెట్ ధరల విషయంలో కూడా అదే వెసులుబాటు ఉండటం సమంజసం. దయచేసి ఈ విషయంపై పునరాలోచించండి. ఆ ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుంది. థియేటర్ల మనుగడ కోసం ప్రభుత్వం ఆలోచించాలి. సినిమా పై ఆధార పడ్డ కుటుంబాల కోసం పునరాలోచన చేయాలి' అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.