అందరి చూపు మెగాస్టార్ నిర్ణయం వైపు!

Update: 2024-01-17 08:15 GMT

Full Viewఊగిసలాట వీడి మెగా స్టార్ చిరంజీవి తన నిర్ణయం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ తో పాటు లోక్ సభ ఎన్నికలకు వచ్చే నెలలోనే షెడ్యూలు విడుదల కాబోతోంది. దీంతో మెగా స్టార్ చిరంజీవి ఇప్పుడు ఎటు వైపు మొగ్గుతారు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. తన తమ్ముడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అండగా ఉంటారా లేక...ఎందుకొచ్చిన గొడవ అని ఎలాంటి నిర్ణయం ప్రకటించకుండా మౌనం దాల్చుతారా అన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. వచ్చే ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో తెలుగు దేశం, జనసేనలు కలిసి వెళ్లాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గతంలో ఒకసారి తన మద్దతు తమ్ముడు పవన్ కళ్యాణ్ కు కాకుండా ఇతరులకు ఎలా ఉంటుంది అని ప్రశ్నించారు. నిజాయతి, నిబద్ధతకు మారు పేరు పవన్ కళ్యాణ్ అని వ్యాఖ్యానించిన చిరంజీవి...ఆ తర్వాత కొద్ది నెలలకే ఒక ఇంటర్వ్యూ లో మాత్రం వచ్చే ఎన్నికల్లో జగన్ , పవన్ ఫైట్ ను ఒక ప్రేక్షకుడిగా చూడటం తప్ప ఏమీ చేయలేను అని ప్రకటించారు. తాను ప్రజలను ఏమైనా అడిగితే నా సినిమాలు చూడండి నన్ను మరింత బిజీ గా ఉంచండి అని అడుగుతాను తప్ప ...మరేమి అడగను అంటూ నాలిక మడతేశారు. ఇప్పుడు కూడా ఇదే స్టాండ్ లో ఉన్నారా లేక తమ్ముడి వైపు నిలబడతారా అన్న విషయంలో క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

                                కొద్ది నెలకే క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించిన వారాహి యాత్ర సందర్భంగా టాలీవుడ్ కు చెందిన హీరో ల ఫాన్స్ అందరూ రాజకీయాలకు అతీతంగా, ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్ కోసం తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. గతానికి బిన్నంగా పవన్ కళ్యాణ్ వారాహి టూర్ లో ప్రభాస్ తో పాటు ఎన్టీఆర్, మహేష్ బాబు, రవి తేజ, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోల పేర్లు చెప్పి మరీ వాళ్ళ ఫ్యాన్స్ మద్దతు కోరారు. ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్ కోసం అలోచించి అందరూ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాంటిది అత్యంత కీలక ఎన్నికల వేళ స్వయంగా పవన్ కళ్యాణ్ అన్న అయిన చిరంజీవి తీసుకునే నిర్ణయం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది అనే చెప్పొచ్చు. గతంలో ఒక సారి జనసేన పీఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఎన్నికల సమయంలో జనసేనకు చిరంజీవి మద్దతు ప్రకటిస్తారు అని పార్టీ సమావేశంలో వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి దర్శకుడు వశిష్ట తో కలిసి విశ్వంభర అనే సినిమా చేస్తున్నారు. దీంతో పాటు మరో ప్రాజెక్ట్ కూడా ట్రాక్ లో ఉంది. చిరంజీవి రెండు సినిమాలతో బిజీ గా ఉన్నా మద్దతు ప్రకటన చేయటానికి ఇవేమి అడ్డంకి కావు అనే చెప్పొచ్చు. మరి కీలక ఎన్నికల వేళ చిరంజీవి ఎలాంటి ప్రకటన చేస్తారో అన్న చర్చ ఆయన ఫ్యాన్స్ తో పాటు రాజకీయ వర్గాల్లో కూడా ఉంది. 

Tags:    

Similar News