మరి మిగిలిన జన సేన అభ్యర్థుల పరిస్థితి ఏంటో !

Update: 2024-05-07 15:45 GMT

Full Viewఫస్ట్ సీఎం రమేష్ కోసం..ఇప్పుడు పవన్ కోసం

మెగా స్టార్ చిరంజీవి కొద్ది రోజుల క్రితం ఒక వీడియో విడుదల చేశారు. సుదీర్ఘకాలం తర్వాత రాజకీయాలపై మాట్లాడుతున్నట్లు అందులో చెప్పారు. దీనికి ప్రధానమైన కారణం తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్నారు. చంద్రబాబు నాయుడు తెలుగు దేశం నుంచి..బీజేపీ నాయకత్వం వీళ్ళు అంతా ఒక కూటమిగా ఏర్పడ్డారు. అది చాలా సంతోషం. మంచి పరిణామం. ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడానికి కారణం నా చిరకాల మిత్రుడు సీఎం రమేష్, పంచకర్ల రమేష్. నాకు కావాల్సిన వాళ్ళు ఇద్దరూ కూడా అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్, పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా పంచకర్ల రమేష్ పోటీ చేస్తున్నారు. ఇద్దరూ మంచి వాళ్లే కుండా..సమర్థవంతులు. అభివృద్ధిలో వీళ్ళు రిజల్ట్ చూపిస్తారు కాబట్టి వీళ్లిద్దరి గురించి ప్రస్తావిస్తున్నాను అని తెలిపారు. ఇప్పుడు మంగళవారం నాడు చిరంజీవి మరో వీడియో విడుదల చేశారు. అందులో ఆయన ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలో బరిలో నిలిచిన జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ను గెలిపించాలి అని పిలుపునిచ్చారు. అందులో పవన్ కళ్యాణ్ పై చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. తనకంటే జనం గురించి ఎక్కువుగా ఆలోచించే మనస్తత్వం పవన్ కళ్యాణ్ ది అన్నారు. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారని.. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టారన్నారు.

                                                        సరిహద్దుల దగ్గర ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడే జవాన్ల కోసం పెద్ద మొత్తంలో సాయం చేయడంతో పాటు.. అనేక మందికి ఎందరికో పవన్ కళ్యాణ్ చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనానికి కావాల్సింది అనిపిస్తుందని వీడియోలో చిరంజీవి వ్యాఖ్యానించారు. సినిమాల్లోకి బలవంతంగా వచ్చాడని.. రాజకీయాల్లోకి ఇష్టంతో మాత్రమే వచ్చాడన్నారు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుందని, అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుందన్నారు. కొడుకు కోసం బాధపడుతున్న తన తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పానని, నీ కొడుకు ఎంతో మంది తల్లులకోసం, వాళ్ల బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధమని తెలిపానన్నారు. ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలంటే చట్టసభల్లో ఆయన గొంతు ఉండాలన్నారు. జనమే జయం అని నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు కళ్యాణ్‌ను గెలిపించాలన్నారు.

                                                          మీకు సేవకుడిగా సైనికుడిగా అండగా నిలబడతాడని, మీకోసం అవసరమైతే కలబడతాడని, మీకల నిజం చేస్తాడని చిరంజీవి తెలిపారు. పిఠాపురం వాసులకు మీ చిరంజీవి విన్నపం అంటూ గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి పవన్ కళ్యాణ్ ను గెలిపించాలంటూ వీడియోను ముగించారు. చిరంజీవి తన తమ్ముడికి మద్దతుగా వీడియో చేయటాన్ని ఎవరూ తప్పు పట్టారు. ఈ వీడియో లో చిరంజీవి ఒక్క పవన్ కళ్యాణ్ గురించి మాత్రమే ప్రస్తావించి జన సేన ఇతర అభ్యర్థులను వదిలేయటం చర్చనీయంగా మారింది. తమ్ముడి పార్టీ అభ్యర్థులు అందరి గెలుపునకు పిలుపు ఇవ్వకుండా కేవలం పవన్ కళ్యాణ్ గెలుపు కోసం విడిగా వీడియో విడుదల చేశారు. మరి పార్టీ అభ్యర్థుల కోసం మళ్ళీ ప్రత్యేకంగా ఏమైనా వీడియో చేస్తారా...కూటమి తరపున కూడా విడిగా వీడియో చేశారా అన్న చర్చ సాగుతోంది. లేక ఇక ఈ వీడియో తోనే చిరంజీవి రాజకీయపరమైన ప్రకటనలు ముగిసినట్లు అనుకోవాలా అన్నది కొద్ది రోజులు పోతేకాని తెలియదు. కనీసం తమ్ముడి పార్టీ అభ్యర్థులకు అండగా నిలవకుండా..కేవలం పవన్ కళ్యాణ్ కే పరిమితం అయితే ఆయన విమర్శలు ఎదుర్కోక తప్పదు అనే చర్చ సాగుతోంది. 

Tags:    

Similar News