ఆశీర్వాదం..ఐదు కోట్లు

Update: 2024-04-08 11:51 GMT

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం. మెగా స్టార్ చిరంజీవి జనసేనకు ఐదు కోట్ల రూపాయలు విరాళం అందచేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ తో కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఐదు కోట్ల రూపాయల చెక్ లు అందించటమే కాకుండా ..జనసేనకు విజయోస్తు.... విజయీభవ అని చిరంజీవి తమ కుటుంబ ఇలవేలుపు అంజనీపుత్రుడి పాదాల చెంత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఆశీర్వదించారు అని జన సేన వెల్లడించింది. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతలలో ‘విశ్వంభర’ షూటింగ్ లొకేషన్ లో ఈ కార్యక్రమం జరిగినట్లు తెలిపారు. సోమవారం ఉదయమే పవన్ కళ్యాణ్ మరో అన్న నాగబాబు తో కలిసి షూటింగ్ లొకేషన్ కు చేరుకున్నారు. చిరంజీవి ఆశీర్వచనం అందుకున్న పవన్ కళ్యాణ్ ఉద్వేగానికి లోనయ్యారు. ఆ సమయంలోనే అయన చిరంజీవి పాదాలకు నమస్కరించారు.

పార్టీ స్థాపించి పదేళ్లు పూర్తవుతున్న తరుణంలో ఎన్నో ఏళ్లుగా అన్న చిరంజీవి ఆశీర్వచనం కోసం ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ కు అన్నయ్య ఆశీస్సులు దక్కాయన్నారు. ఆదివారం అనకాపల్లిలో జరిగిన విజయభేరి సభలో లోకపావని నూకాలమ్మ దీవెనలను కోరుతున్న సమయంలో టీవీలో ఆ దృశ్యాన్ని చూసిన చిరంజీవి తన తమ్మునికి తన ఆశీర్వాద బలంతోపాటూ ఆర్థికంగానూ అండగా నిలబడాలని ఐదు కోట్ల రూపాయలకు చెక్కును చిరంజీవి సిద్ధం చేసి మరునాడే అందచేశారు. చిరంజీవి తో పాటు అయన తనయుడు మరో హీరో రామ్ చరణ్ సైతం జన సేన ఆర్థికంగా అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు. అయితే జన సేన విడుదల చేసిన ప్రకటనలో ఎక్కడా కూడా రాజకీయ అంశాలను ప్రస్తావించకుండా ఆర్థిక సాయం, ఆశీర్వచనం వంటి అంశాలకే పరిమితం అయ్యారు.

Tags:    

Similar News