తెలుగు దేశం అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి పదే పదే చెప్పేవాళ్ళు. కానీ ఈ సారి పేరు మారింది. అదేంటి అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అంటే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వాళ్లకు అత్యంత వేగంగా అనుమతులు మంజూరు చేసి...ప్రాజెక్ట్ లు టేకాఫ్ అయ్యేలా చూడటం కోసం ఈ మోడల్ ను తీసుకొచ్చినట్లు చెపుతున్నారు. అందుకే నెలలో రెండు సార్లు క్యాబినెట్ సమావేశాలు...అదే సమయంలో ఎస్ఐపీబి సమావేశాలు పెడుతూ వచ్చిన పెట్టుబడులకు ఆగమేఘాల మీద అనుమతులు మంజూరు చేస్తున్నారు. ఇందులో కొన్ని రాష్ట్రానికి పనికి వచ్చేవి ఉన్నాయి..మరి కొన్ని కేవలం పారిశ్రామికవేత్తలకు మాత్రమే పనికి వచ్చేవి..వేల కోట్ల రూపాయల మేర లాభాలు తెచ్చిపెట్టేవి ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుతీరి మరో పది రోజుల్లో రెండేళ్లు పూర్తి చేసుకోనుంది. కానీ పదే పదే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి చెప్పే చంద్రబాబు నాయుడు ఈ రెండేళ్ల సమయంలో దగ్గర దగ్గర ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి విశాఖపట్నంలో జగన్ మోహన్ రెడ్డి హయాంలో నిర్మించిన రిషికొండ భవనాలపై మాత్రం ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదు.
దీన్ని రాజకీయంగా వాడుకొన్నారు. ప్రయోజనం పొందారు. ఒక పార్టీగా ఇందులో తప్పుపట్టాల్సింది ఏమీ లేదు. కానీ ఆ రాజకీయ ప్రయోజనం పొందిన తర్వాత కూడా ఐదు వందల కోట్ల రూపాయల ప్రాపర్టీ ని రెండేళ్ల పాటు అలా ఖాళీగా ఉంచటంపై మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. దీని కోసం మంత్రులతో ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు...ఈ మంత్రుల ఉప సంఘం కూడా పలు మార్లు భేటీ అయి ప్రభుత్వానికి సిఫారసులు కూడా చేసింది. అయినా సరే పదే పదే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడే చంద్రబాబు సర్కారు ఇంత వరకు దీనిపై మాత్రం నిర్ణయం తీసుకోలేదు. దీని వల్ల ప్రభుత్వం విద్యుత్ చార్జీలతో పాటు ఇతర నిర్వహణ ఖర్చుల వల్ల భారీ ఎత్తున భారం పడుతోంది అని అధికార వర్గాలు చెపుతున్నాయి. ఐదు వందల కోట్ల రూపాయల ప్రాపర్టీని ఇలా రెండేళ్లు ఖాళీగా ఉంచటం ఒక తప్పు అయితే...ఇలా ఉంచటంవల్ల ఎలాంటి లాభం లేకపోగా...సర్కారు ఖజానాపై అదనపు భారం పడుతోంది. అయినా సరే చంద్రబాబు నాయుడు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నాన్చుతున్నారు అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
కొత్త ప్రాజెక్ట్ లకు అనుమతి వల్ల ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు ఎన్నో లాభాలు ఉంటాయి అని...కానీ రిషికొండ ప్రాజెక్ట్ ఇప్పటికే పూర్తి అయినందున దీని వల్ల పెద్దగా లాభం ఉండదు అనే నిర్ణయం తీసుకోవటంలో జాప్యం చేస్తున్నట్లు కనిపిస్తోంది అని ఒక ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. ఆతిధ్య రంగంలోని దిగ్గజ సంస్థలు అయిన తాజ్ హోటల్స్ తో పాటు లీలా ప్యాలస్ తో పాటు మరి కొన్ని సంస్థలు రిషికొండ భవనాలు తీసుకోవటానికి ఆసక్తి చూపినట్లు మంత్రులే ప్రకటించారు. ఇలా ప్రకటించి ఆరు నెలలు కావస్తున్నా కూడా ఇంత వరకు దీనిపై తుది నిర్ణయం మాత్రం వెలువడలేదు. దీంతో చంద్రబాబు స్పీడ్ ఆఫ్ బిజినెస్ అంటే ఇదేనా అన్న చర్చ సాగుతోంది. కనీసం కూటమి ప్రభుత్వం కొలువుతీరి రెండేళ్లు అయ్యే లోపు అయినా దీనిపై నిర్ణయం తీసుకుంటారో లేదో చూడాలి. అసలు ఈ ప్రాజెక్ట్ పై నిర్ణయం తీసుకోవటంలో ఎందుకింత జాప్యం చేస్తున్నారు. దీని వెనక ఏదైనా ప్లాన్ ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.