కలిసిన లవ్ సిగ్నల్స్..వైసీపీ అధికారాన్ని జామ్ చేస్తాయా?!

Update: 2022-10-19 06:40 GMT

Full Viewమరో సారి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల కలయికకు రంగం సిద్ధం అయింది. చూస్తుంటే వీరిద్దరికి లవ్ సిగ్నల్స్ కలిసినట్లే కనిపిస్తోంది. మరి ఈ సిగ్నల్స్ కలయిక ద్వారా వైసీపీ అధికార సిగ్నల్స్ జామ్ చేయగలుగుతారా లేదా అన్నది తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే. కాకపోతే ఈ సంకేతాలు ఇటు టీడీపీ తోపాటు జనసేన లో కొత్త ఉత్స్తాహం తీసుకొస్తాయ్ అనటంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా విజయవాడలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల భేటీ ఆసక్తికర చర్చకు తెరతీసింది. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. తాజా పరిణామాలను చూస్తే తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల మధ్య లవ్ సిగ్నల్స్ కుదిరినట్లే సంకేతాలు అందుతున్నాయి. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు ను టీపీడీ , జనసేన ల పొత్తు విషయం పై మీడియా ప్రశ్నించగా వన్ వే లవ్ తో ఉపయోగం ఉండదని అటు వైపు నుంచి కూడా సంకేతాలు ఉండాలి అన్నారు. చంద్రబాబు, పవన్ లు అకస్మాత్తుగా కలిశారా..లేక ముందస్తు ప్లాన్ ప్రకారం కలిశారా అన్న విషయం పక్కన పెడితే వీరిద్దరూ రాబోయే రోజులలో కలిసి ముందుకు సాగటానికే నిర్ణయించుకున్నట్లు స్పష్టం అవుతోంది. ఇప్పడు ఏపీలో జనసేన, బీజేపీ పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ మంగళ వారం నాడు కార్యకర్తల సమావేశంలో చేసిన కామెంట్స్ చూస్తే అయన బీజేపీ కి గుడ్ బై చెప్పటానికే నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది బీజేపీ, మోడీ అంటే ఇష్టమే కానీ ఆలా అని ఊడిగం చేయలేము కదా అని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఏపీ సీఎం జగన్ విషయంలో సాఫ్ట్ గా ఉంటున్నారని ప్రచారం ఎప్పటినుంచో ఉంది. ఈ విషయం పవన్ ఇంత లేట్ గా గ్రహించారా అన్న కామెంట్స్ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో ఉన్నాయి . ఇక్కడ మరో కీలక అంశం ఏమిటి అంతే టీడీపీ అధినేత చంద్రబాబు ఇటు జనసేన తో పాటు బీజేపీ తో కూడా పొత్తు కోరుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఆ పార్టీ వోట్ బ్యాంకు కంటే కేంద్రంలో ఆ పార్టీ అధికారం లో ఉన్నందున ఇది ఎంతో కొంత ఉపయోగంగా ఉంటుంది అనేది చంద్రబాబు ఆలోచన గా చెపుతున్నారు. అయితే కేంద్ర నాయకత్వం మాత్రం ఎవరు ఎన్ని చెప్పిన ఇప్పటికిప్పుడు జగన్ కి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోదని అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. జగన్ మరి బలహీన పడ్డారు అని ఆ పార్టీ భావిస్తే తప్ప ఇందులో ఎలాంటి మార్పులు ఉండవని అంటున్నారు. మొత్తానికి ఇంకా ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగానే ఏపీలో ఎన్నికల వేడి ప్రారంభం అయినట్లే కనిపిస్తోంది .

Tags:    

Similar News