అంతా ఒక లెక్క ప్రకారమే!

Update: 2024-06-12 12:42 GMT

రాజకీయాల్లో అవసరాలే ముఖ్యం. అంతకు ముందు ఏమి జరిగింది అన్నది నాయకులు అందరూ చాలా కన్వీనెంట్ గా మర్చిపోతారు. అది మోడీ అయినా..చంద్రబాబు అయినా. ఢిల్లీ లో మోడీ సర్కారు కు ఇప్పుడు చంద్రబాబు ఎంతో కీలకం. ప్రస్తుతానికి అయితే చంద్రబాబు సపోర్ట్ తోనే ఎన్డీఏ పేరుతో పిలవబడే బీజేపీ సర్కారు కొనసాగుతోంది. టీడీపీ తో పాటు నితీష్ కుమార్ కు చెందిన జెడీ యూ తో పాటు మరికొన్ని చిన్న పార్టీ లు కూడా ఉన్నాయి. నంబర్ల పరంగా చూస్తే టీడీపీ, జె డీ యూ లే కీలకం అని చెప్పాలి. అయితే మోడీ ఐదేళ్లు ఇలాగే దీన్ని కొనసాగిస్తారా...లేక కొంత సర్దుకున్న తర్వాత పాత పద్దతిలో విలీనాలు...ఇతర పార్టీ ల వారిని కలిపేసుకోవటాలు చేస్తారా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. బుధవారం నాడు గన్నవరం దగ్గరలోని కీసరపల్లి ఐటి పార్క్ వద్ద టీడీపీ అధినేత అధినేత చంద్రబాబు నాయుడు నాల్గవసారి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ తో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీతో పాటు మెగా స్టార్ చిరంజీవి, రజని కాంత్ తదితరులు హాజరు అయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అయిన తర్వాత జన సేన అధినేత పవన్ కళ్యాణ్ వేదికపైన చిరంజీవి ఉన్న విషయాన్ని మోడీ కి చెప్పారు.

                                  అంతే మోడీ వెంటనే పవన్ కళ్యాణ్ చేయి పట్టుకుని చిరంజీవి దగ్గరకు తీసుకువెళ్లారు. తర్వాత మెగా బ్రదర్స్ ఇద్దరి చేతులు పైకి ఎత్తి ప్రజలకు అభివాదం చేశారు. ఇద్దరినీ కలిపి ఆలింగనం చేసుకున్నారు. తర్వాత చంద్రబాబు కూడా అదే వేదికపై ఉన్న రజని కాంత్, బాలకృష్ణలను మోడీ కి పరిచయం చేశారు. అయితే చంద్రబాబు ప్రమాణస్వీకార వేదికపై మెగా బ్రదర్స్ కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా మోడీ ఇచ్చిన సంకేతాలు ఏంటి? అనే చర్చ తెర మీదకు వచ్చింది. చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలపై ఫోకస్ పెడుతున్నా కూడా బీజేపీ మొదటి నుంచి చిరంజీవి విషయంలో చాలా సానుకూలంగా వ్యవహరిస్తూ వస్తోంది. పవన్ కళ్యాణ్ ఎలాగూ ఇప్పుడు ఎన్ డీ ఏ లోనే ఉన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదికపై నుంచి మోడీ అటు చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా రాష్ట్ర ప్రజలకు ఇవ్వాల్సిన సంకేతాలు ఇచ్చారు అనే చర్చ సాగుతోంది. భవిష్యత్ కోణంలోనే ఇది చేసినట్లు కనిపిస్తోంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే ఇప్పటికిప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో పెద్దగా మార్పులకు స్కోప్ అయితే లేదు అనే చెప్పొచ్చు.

Tags:    

Similar News