సీనియర్లకు భారీగా కోతలు....కొత్త వాళ్ళకే ఎక్కువ ఛాన్స్

Update: 2024-06-10 05:52 GMT

బీజేపీ నుంచి సుజనా..సత్య కుమార్ లకు అవకాశం!

పవన్ తో పాటు మిగిలిన వాళ్ళు ఎవరో!

కేంద్రంలో మోడీ మంత్రివర్గం కొలువుతీరింది. దీంతో ఇక ఇప్పుడు అందరి కళ్ళు ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గంపైనే ఉన్నాయి. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎవరెవరికి మంత్రి వర్గంలో చోటు కలిపించబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సారి చంద్రబాబు మంత్రివర్గంలో ఎన్నో సంచలనాలు ఉండే అవకాశం ఉంది టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు క్యాబినెట్ లో ఆయన తనయుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేరిక ఖాయం అయిపొయింది. అయితే చంద్రబాబు ఈ సారి పెద్ద ఎత్తున సీనియర్లకు కోత పెట్టి కొత్తవారికి మంత్రి వర్గంలో ఎక్కువగా చోటు కలిపించే అవకాశం ఉంది అని బలంగా పార్టీ నేతల్లో ప్రచారం జరుగుతోంది. దీని వెనక బలమైన కారణాలు ఉన్నట్లు చెపుతున్నారు. అవేంటి అంటే ఎక్కువ మంది కొత్త వాళ్లకు చోటు కలిపించటం ద్వారా నారా లోకేష్ కు ఇప్పటి నుంచే లైన్ క్లియర్ చేసే పనిలో ఉన్నట్లు చెపుతున్నారు. ఇప్పటికే అటు పార్టీ నాయకులు, అధికారులు కూడా ఎక్కువగా నారా లోకేష్ దగ్గరకే వెళుతున్నారు.

                                              అటు పార్టీపై లోకేష్ ఇప్పటికే చాలా వరకు పట్టు సాధించినట్లే అని అని ఒక సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంలో కూడా పూర్తి పట్టుకోసమే పక్కా ప్లాన్ తోనే చంద్రబాబు ఇది అంతా చేస్తున్నట్లు ఒక సీనియర్ నేత వెల్లడించారు. చంద్రబాబు క్యాబినెట్ లో జన సేన, బీజేపీ లు చేరటం కూడా పక్కా అని తేలిపోయింది. ఈ ఎన్నికల్లో కూటమి గెలుపులో కీలకపాత్ర పోషించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి ఖాయం. తనకు ఈ పదవి పై ఆసక్తి ఉంది అని పవన్ కళ్యాణ్ స్వయంగా ఢిల్లీ లో ఒక జాతీయ ఛానెల్ తో మాట్లాడుతూ స్పష్టం చేశారు. దీంతో ఇప్పటివరకు అంటే పవన్ కళ్యాణ్ తాను స్వయంగా మంత్రివర్గంలో చేరతారా లేదా అన్న అంశంపై నిపై ఉన్న అనుమానాలు తొలగిపోయాయి.

                                    పవన్ తో పాటు జనసేన కు ఇంకెన్ని మంత్రి పదవులు దక్కుతాయి...ఎవరి పేర్లను పవన్ కళ్యాణ్ సిఫారసు చేస్తారు అన్నది ఇప్పుడు కీలకం కానుంది. కేంద్ర మంత్రి వర్గంలో రామ్మోహన్ నాయుడి కి కేంద్ర క్యాబినెట్ పదవి దక్కినందున రాష్ట్రంలో టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చన్నాయుడు కు ఛాన్స్ దక్కపోవచ్చు అని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. ఎప్పటిలాగానే నారాయణకు మంత్రి పదవి దక్కటం ఖాయం అనే చెప్పొచ్చు. అయితే ఎంత మంది సీనియర్లకు కోత పడుతుంది..ఎంత మంది కొత్త వాళ్ళు వస్తారో అన్న టెన్షన్ టీడీపీ నేతల్లో కనిపిస్తోంది. అయితే ఎవరికి ఇచ్చినా కూడా గత ఐదేళ్లల్లో పార్టీ కోసం ఎవరు ఎంత కష్టపడ్డారు అనే అంశాలను ప్రామాణికంగా తీసుకుని మంత్రి వర్గంలో చోటు కలిపిస్తేనే ఉపయోగం ఉంటుంది అనే చర్చ సాగుతోంది. బీజేపీ నుంచి ఈ సారి సుజనా చౌదరి, సత్య కుమార్ లకు చంద్రబాబు మంత్రివర్గంలో చోటు ఉంటుంది అని ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News