తెలుగు దేశం అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కు లైన్ క్లియర్ చేస్తున్నారు. ఇప్పటికే పార్టీలోనూ...ప్రభుత్వంలోనూ నారా లోకేష్ మాటే చెల్లుబాటు అవుతుంది అని ప్రచారం ఉన్న వేళ కొత్తగా ప్రకటించిన టీడీపీ కమిటీల్లోనూ నారా లోకేష్ మనుషులకు పెద్ద పీట దక్కింది. నారా లోకేష్ కు కూడా ఎలివేషన్ దక్కింది. ఆయన్ను టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. ఇప్పటి వరకు టీడీపీ లో ఈ పోస్ట్ లేదు. కొత్తగా నారా లోకేష్ కోసమే దీన్ని డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది. మరో వైపు నారా లోకేష్ ఇప్పటి వరకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అటు పార్టీలో...ఇటు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టడానికి ఆయన ఇంకా ఒక్క అడుగు దూరంలో ఉన్నట్లు ఈ కమిటీ ద్వారా చంద్రబాబు నాయుడు సంకేతాలు ఇచ్చారు అని ఒక టీడీపీ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. టీడీపీ లో ఉన్నా కూడా ఎక్కువ శాతం తెరవెనక కార్యక్రమాలకే పరిమితం అయి ఉన్న నారా లోకేష్ ఫ్రెండ్, సన్నిహితుడిగా పేరున్న కిలారు రాజేష్ ఇప్పుడు ఏకంగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులు అయ్యారు.
ఆయనతో పాటు కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు, ఎంపీ బైరెడ్డి శబరి కి కూడా జాతీయ ప్రధాన కార్యదర్శి పదవులు దక్కాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళ ముగ్గురు కూడా నారా లోకేష్ టీం కిందే లెక్క. నారా లోకేష్ మరో సన్నిహితుడు, ఎంపీ సానా సతీష్ కు జాతీయ ఉపాధ్యక్ష పదవి దక్కింది. జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మందికి చోటు కల్పించారు. నందమూరి బాలకృష్ణ కు మరో సారి పొలిట్ బ్యూరో సభ్యత్వమే దక్కింది. పార్టీ పదవుల విషయంలో నందమూరి బాలకృష్ణ అసంతృప్తి తో ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగింది. అయినా మరో సారి ఆయనకు అందరితో పాటు పొలిట్ బ్యూరో లో చోటు కల్పించారు. గతంలో పొలిట్ బ్యూరో లో ఉన్న సీనియర్లకు ఈ సారి కూడా చోటు దక్కింది. ఇది ఇలా ఉంటే కొద్ది నెలల క్రితం నారా లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ టీడీపీ నేతల నుంచే వచ్చింది. ఇది అప్పటిలో రాజకీయంగా పెద్ద దుమారం కూడా రేపింది. కొంత మంది జనసేన నాయకులు దీనిపై అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా ఒక్కరే ఉండాలి అని..అది పవన్ కళ్యాణ్ మాత్రమే అంటూ కొంత మంది జనసేన నాయకులు వ్యాఖ్యానించారు.
కారణాలు ఏమైనా కూడా తర్వాత ఈ ప్రతిపాదన అటకెక్కింది. అయినా కూడా ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సమానంగా ప్రతి యాడ్ లోనూ పవన్ కళ్యాణ్ ఫోటో పక్కనే నారా లోకేష్ ఫోటో కూడా ప్రచురిస్తున్నారు. అది ఏ శాఖ యాడ్ అయినా కూడా నారా లోకేష్ ఫోటో అందులో ఉండాల్సిందే. చాలా రోజులు ఆయా శాఖల మంత్రులను ఏ మాత్రం పట్టించుకోకుండా ఒక వైపు పవన్ కళ్యాణ్, మరో వైపు నారా లోకేష్ ఫోటో లు వేస్తూ వస్తున్నారు. పొలిటికల్ గా తాజాగా ఇచ్చిన ఎలివేషన్ తో రాబోయే రోజుల్లో నారా లోకేష్ నేరుగానే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతారు అని కూడా టీడీపీ నేతలు చెపుతున్నారు.