ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో సారి దావోస్ పర్యటనకు రెడీ అయ్యారు. ఎప్పటి లాగానే చంద్రబాబు తో పాటు ఐటి శాఖ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టి జి భరత్ కూడా ఈ టీంలో ఉన్నారు. వచ్చే ఏడాది జనవరి 19 నుంచి 23 వరకు వీళ్ళు అంతా స్విట్జర్లాండ్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనబోతున్నారు. ప్రయాణ సమయం కాకుండా వీళ్ళు అంతా జనవరి 19 నుంచి 23 వరకు ఈ సమావేశంలో పాల్గొంటారు అని ప్రభుత్వం వెల్లడించింది. వీరి పర్యటనకు సంబంధించి ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. చంద్రబాబు..మంత్రులతో పాటు ఈ టీం లో సీఎంఓ కార్యదర్శి కార్తికేయ మిశ్రా, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ శుభం బన్సల్ కూడా ఇందులో ఉన్నారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ సమావేశాల్లో పాల్గొంటారు అనే విషయం తెలిసిందే.
ఈ ఏడాది జనవరిలో జరిగిన దావోస్ సమావేశంలో కూడా చంద్రబాబు, నారా లోకేష్, టి జి భరత్ లు పాల్గొన్నారు. గతానికి భిన్నంగా ఈ ఈ ఏడాది దావోస్ లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పెద్దగా ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేకపోయింది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే తెలంగాణ ప్రభుత్వం దావోస్ లో దగ్గర దగ్గర డెబ్భై వేల కోట్ల రూపాయల మేర ఒప్పందాలు చేసుకోగా...ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అవేమి లేకుండానే వెనక్కి తిరిగింది. దీని కవర్ చేసుకునేందుకు దావోస్ మీటింగ్ ఒప్పందాలు చేసుకునే వేదిక కాదు..ఇది ఒక కనెక్టింగ్ సెంటర్ మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు.
ఇటీవలే ప్రభుత్వం వైజాగ్ లో భారీ ఎత్తున భాగస్వామ్య సదస్సు నిర్వహించి ఏకంగా 13 లక్షల కోట్ల రూపాయలకు పైనే పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూ లు చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇందులో సగం అమల్లోకి వచ్చినా కూడా ఎంతో ఘనవిజయం సాధించినట్లు లెక్క అనే అభిప్రాయం ఎక్కువ మంది అధికారుల్లో ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే ఇంత భారీ సదస్సు నిర్వహించి ఒప్పందాలు చేసుకుని మళ్ళీ ఎప్పటిలాగానే దావోస్ వెళ్లి ఏమి చేస్తారో అర్ధం కావటం లేదు అని అధికారులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతి ఏటా ఈ సదస్సు కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం తప్ప దీని వల్ల కలిగిన ప్రయోజనం ఏంటో ఎప్పుడూ చెప్పిన దాఖలాలు లేవు.