ఒక వైపు ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలి అని ఇటీవలే విజ్ఞప్తి చేశారు. అత్యవసరం అయితే తప్ప అదనపు ఖర్చులు లేకుండా చూసుకోవాలని కోరిన విషయం తెలిసిందే. ఆయన అలా పిలుపు ఇచ్చారో లేదో....చంద్రబాబు సర్కారు ఆగమేఘాల మీద కాన్వాయ్ ల తగ్గింపుతో పాటు ఏకంగా మహానాడు కార్యక్రమాన్ని కూడా హైబ్రిడ్ మోడ్ కు మరిచిన విషయం తెలిసిందే. కొంత మంది మంత్రులు అయితే ఏకంగా సైకిల్స్ మీద ప్రయాణం చేస్తున్నారు. మీడియా లో హల్చల్ చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న విదేశీ పర్యటనల విషయంలో మాత్రం కూటమి సర్కారు ఏ మాత్రం వెనక్కి తగ్గేలా లేదు. సరిగ్గా గత ఏడాది జూన్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో పాటు మంత్రులు నారాయణ, లోకేష్, టి జీ భరత్ తో పాటు మరి కొంత అధికారుల బృందం సింగపూర్ లో పర్యటించి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మే నెలలోనే మంత్రి నారా లోకేష్ మరో సారి సింగపూర్ లో పర్యటించి వచ్చారు. ఇప్పుడు మరో సారి ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో మంత్రులు..అధికారుల బృందం సింగపూర్ పర్యటనకు వెళ్లనుంది.
ఈ మేరకు సర్కారు శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 14 నుంచి 16 వరకు సింగపూర్ లో జరగనున్న ప్రపంచ నగరాల సదస్సుకు వీళ్ళు హాజరుకానున్నట్లు జీవోలో పేర్కొన్నారు. రెండేళ్లకు ఒక సారి ఈ వరల్డ్స్ సిటీస్ సమ్మిట్ జరుగుతుంది. ఈ సారి సింగపూర్ ట్రిప్ లో సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి నారా లోకేష్, ఐఏఎస్ అధికారులు కార్తికేయ మిశ్రా, ఎన్. యువరాజ్, ఏపీసిఆర్డీఏ కమిషనర్ వి. విజయరామరాజు, ఈడీబీ సీఈఓ ఎస్. షాన్ మోహన్ లు ఉన్నారు. ఈ పర్యటనకు అయ్యే ఖర్చు అంతా కూడా ఏపీఈడీబీ భరిస్తుంది అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రధాని మోడీ ప్రకటన రాక ముందు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన మంత్రుల బృందం ఒకటి సింగపూర్ లో శిక్షణ తీసుకుని వచ్చిన సంగతి తెలిసిందే. అంతే కాదు...కొంత మంది ప్రభుత్వ టీచర్లను కూడా కూడా ఆంధ్ర ప్రదేశ్ సర్కారు స్టడీ టూర్ కోసం సింగపూర్ పంపింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగాలేకపోయినా కూడా సింగపూర్ ఎకానమీ కి మాత్రం కూటమి ప్రభుత్వం తన వంతు సహకారం అందిస్తున్నట్లు ఉంది అని ఒక ఐఏఎస్ అధికారి వ్యంగంగా వ్యాఖ్యానించారు.