ఇది చంద్రబాబు మాట
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అమరావతి అంశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తాజా ప్రకటన గురించి ప్రస్తావించారు. అంత వరకూ ఓకే. అంతే కాదు..ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా అమరావతికి అనుకూలంగా ఉన్నప్పుడు సీఎం జగన్ ఒక్కడికి ఎందుకు అంత పట్టుదల అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీది దుర్మార్గపు పాలన సాగుతోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేరస్థులకు అడ్డాగా మారుతోందని ఆరోపించారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో పొట్టి శ్రీరాములు, వల్లభాయ్ పటేల్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా చంద్రబాబు పొట్టి శ్రీరాములు, పటేల్ చిత్రపటాలకు పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశాన్ని ఐక్యం చేస్తే పొట్టి శ్రీరాములు తెలుగువారిని ఐక్యం చేశారని అన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు పొట్టిశ్రీరాములు నాంది పలికారని, త్యాగానికి మారుపేరుగా నిలిచారన్నారు. పొట్టి శ్రీరాములు స్పూర్తితోనే విభజన ఆంధ్రప్రదేశ్‌ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేశామన్నారు.
రూపాయి ఖర్చులేకుండా అదనపు ఆదాయం వచ్చే విధంగా అమరావతికి శ్రీకారం చుట్టామన్నారు. అన్ని ప్రాంతాల వారు అమరావతి పోరాటానికి సహకరిస్తుంటే సీఎం జగన్‌కు ఎందుకు ఇంత పట్టుదలని చంద్రబాబు ప్రశ్నించారు. బీజేపీ కూడా రైతుల ఉద్యమానికి సహకరిస్తూ.. ప్రధాని మోదీ కూడా సానుకూలమని ప్రకటించారన్నారు. ఏపీకి జరుగుతున్న అన్యాయం చూసి పొట్టిశ్రీరాములు ఆత్మ కూడా క్షోభిస్తుందన్నారు. నవ్యాంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్4న నిర్వహించటమే సబబు అని అన్నారు. వైసీపీ మాదిరిగా ఆనాడు టీడీపీ ప్రభుత్వమూ అరాచకాలు చేసి ఉంటే ఒక్కరు కూడా బయట తిరిగేవారు కాదన్నారు.