చంద్రబాబు స్టైల్ కు భిన్నంగా నిర్ణయం

Update: 2020-11-16 13:22 GMT

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఏ నిర్ణయం అయినా నాన్చి నాన్చి కానీ తీసుకోరు. కానీ అనూహ్యంగా ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. అదేంటి అంటే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్ధి ప్రకటన. గత ఎన్నికల్లో పోటీచేసి పరాజయం పాలైన పనబాక లక్ష్మీనే ఈ సారి కూడా అభ్యర్ధిగా ప్రకటించారు. తిరుపతి ఉప ఎన్నిక అంశంపై చంద్రబాబు సోమవారం నాడు పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగానే ఆయన అభ్యర్ధి గురించి ప్రకటించారు. సహజంగా అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదల అయి.. ఇతర పార్టీలు అన్నీ అభ్యర్ధులను ప్రకటించిన తర్వాత కానీ అన్ని విషయాలు చూసి ప్రకటనలు చేయని చంద్రబాబు ఈ సారి అందుకు భిన్నంగా చేయటం ఆసక్తికరంగా మారింది.

సిట్టింగ్ వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మరణించటంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయిన విషయం తెలిసిందే. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తొలుత ఈ సీటును బిజెపికి వదిలేయటానికి వీలుగా బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా వద్దకు రాయభారం పంపారు. కానీ అదేమి వర్కవుట్ అయినట్లు లేదు. దీంతో ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకుని అభ్యర్ధిపై ప్రకటన కూడా చేసేశారు. అయితే బిజెపి, జనసేనలు కలసి ఇక్కడ బరిలో నిలవబోతున్నాయి. అధికార వైసీపీ దివంగత ఎంపీ దుర్గాప్రసాద్ కుటుంబానికే టికెట్ ఇస్తుందా? లేక వేరే అభ్యర్థిని నిలబెడుతుందా అనేది వేచిచూడాల్సిందే. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక రాజకీయంగా అత్యంత కీలకంగా మారనుంది.

Tags:    

Similar News