అసెంబ్లీలో బిల్లులు అయితే ఆమోదం పొందాయి. రాజధాని అమరావతి వ్యవహారం కోర్టులో ఉంది. అమరావతి నుంచి విశాఖకు రాజధాని తరలింపుపై ఏపీలో అనిశ్చితి కొనసాగుతుంది. హైకోర్టులో గ్రీన్ సిగ్నల్ ఇస్తే కానీ విశాఖకు పరిపాలనా రాజధాని తరలించలేని పరిస్థితి. అయితే ఈ తరుణంలో కేంద్రం ఓ ప్రశ్నకు సమాధానంగా ఏపీ రాజధానిగా విశాఖపట్నం పేరును ప్రస్తావించింది. దీంతో ఏపీలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఓ వైపు రాజధానుల వ్యవహారం కోర్టులో ఉండగా..కేంద్రం రాజధానిగా విశాఖపట్నాన్ని ఎలా పేర్కొంటుంది అంటూ విమర్శలు విన్పిస్తున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం ..ముఖ్యంగా సీఎం జగన్ రాసే లేఖల్లోనూ అమరావతే అనే పేరు ఉండటం విశేషం.
పెరిగిన పెట్రోల్ ధరల ప్రభావం రాష్ట్రాల్లో అంచనా వేశారా అంటూ... ఎంపీ కె .సుధాకరన్ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. కేంద్రం విడుదల చేసిన రాజధానుల పట్టికలో ఏపీ రాజధానిగా విశాఖను పేర్కొంది. గతంలో ఏపీ రాజధాని అంశం న్యాయపరిధిలో ఉందని కేంద్రం చెప్పింది. న్యాయపరిధిలో ఉన్న అంశాన్ని లోక్‌సభలో ప్రస్తావించడాన్ని అమరావతి జేఏసీ తప్పుపడుతోంది. తాజాగా ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యానారాయణ అమరావతి రైతులతో చర్చలు జరిపేది లేదని..విశాఖకు రాజధానిని తరలిస్తామని స్పష్టం చేశారు. కోర్టు ఆమోదంతోనే ఈ పని చేస్తామన్నారు.