ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ కు సంబంధించిన కేసు జులై1కి వాయిదా పడింది. తాను ఎలాంటి బెయిల్ షరతులు ఉల్లంఘించలేదని..రఘురామరాజు పిటీషన్ కేవలం ప్రచారం కోసమే తప్ప..అసలు ఆయనకు పిటీషన్ వేసే అర్హత లేదంటూ జగన్ వేసిన పిటీషన్ కు రఘురామరాజు సీబీఐ కోర్టులో కౌంటర్ వేశారు. ఇందులో ఆయన ప్రస్తావించిన అంశాలు కీలకంగా ఉన్నాయి. సీబీఐలోని కొందరు వ్యక్తులు కేసును ప్రభావితం చేస్తున్నారని..అందుకే సీబీఐ తన పిటీషన్ పై ఎలాంటి వైఖరి వెల్లడించలేదని రఘురామ తన కౌంటర్ పిటీషన్ లో పేర్కొన్నారు. తనపై కేసులు మాత్రమే ఉన్నాయని..ఛార్జిషీట్లు లేవన్నారు.
కౌంటర్ లో జగన్ తనపై చేసినవి అసత్య ఆరోపణలు అని తోసిపుచ్చారు. పిటీషన్ విచారణ అర్హతపై కోర్టు నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకా అర్హత లేదనటం సరికాదన్నారు. పిటీషన్ పై విచారణకు తన కేసులకు సంబంధం లేదని తెలిపారు. జగన్ బెయిల్ రద్దు పిటీషన్ వేసిన తర్వాత సీఐడి తనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయటంతోపాటు..చిత్రహింసలకు గురిచేశారని పేర్కొన్నారు. రఘురామక్రిష్ణంరాజు వాదనలకు కౌంటర్ ఇచ్చేందుకు సమయం కావాలని జగన్ తరపు లాయర్లు కోరగా సీబీఐ కోర్టు కేసును జూలై 1కి వాయిదా వేసింది.