ఇకపై ఉద్యోగులు పిలిస్తేనే చర్చలకు వస్తాం
కొత్త సంస్కృతి తెస్తారా?. ఇది ప్రజాస్వామ్యం
ఉద్యోగ సంఘం నేతలపై మండిపాటు
ఏపీ మంత్రివర్గంలో సీనియర్ మంత్రి బొత్సా సత్యనారాయణకూ మాట్లాడే ఛాన్స్ వచ్చింది. ఏపీ ఉద్యోగులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం నియమించిన కమిటీలో సీనియర్ అయిన బొత్స సత్యనారాయణతోపాటు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి సభ్యులుగా ఉన్నారు. గత కొన్ని రోజులుగా మంత్రులను పక్కన పెట్టుకుని సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి మాత్రమే మాట్లాడి వెళుతున్నారు. మంత్రులు ఇంత కాలం చూస్తూ వచ్చారు. అయితే శుక్రవారం నాడు మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణకు ఈ అంశంపై మాట్లాడే ఛాన్స్ వచ్చింది. ఆయనే ఉద్యోగులతో చర్చలకు సంబంధించిన అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక తాము రోజూ వచ్చి ఉద్యోగుల కోసం కూర్చోబోమని..వారు పిలిస్తేనే చర్చలకు వస్తామని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కొత్త సంస్కృతి తీసుకువస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం ఇది అని గుర్తించాలన్నారు. ఉద్యోగులను చర్చలకు పిలిచినా పీఆర్‌సీ సాధన కమిటీ వాళ్లు చర్చలకు రాకపోవడం బాధాకరమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉద్యోగులు రాజకీయ ఆలోచన చేస్తున్నారా అని ప్రశ్నించారు. జీతాలు పడితే కదా.. పెరిగేది, తగ్గేది తెలిసేదని, ఎవరికీ కూడా రూపాయి కూడా తగ్గదని మంత్రి స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాల నేతలను మంత్రుల కమిటీ శుక్రవారం మరోసారి సమావేశానికి ఆహ్వానించింది.రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగుల సమస్యల కోసమే కమిటీ వేశామని, ఉద్యోగుల్లో అపోహలు తొలగించేందకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.
ఉద్యోగులతో చర్చలకు తాము అందుబాటులో ఉన్నామని మరోసారి స్పష్టం చేశారు. ఘర్షణ వాతావరణం మంచిది కాదని, వాళ్ళు ఎప్పుడు చర్చకు వస్తామంటే అప్పుడే చర్చిస్తామని తెలిపారు. సమస్య ఉంటే పరిష్కారం కోసం చూడాలే కానీ..రాజకీయ ఆలోచనలు చేసేలా ఉండకూడదన్నారు. ఆ తర్వాత సజ్జల కూడా మీడియాతో మాట్లాడారు. కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు జనవరి వేతనాలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉద్యోగుల ఆందోళన, సంఘాల నేతల మూడు డిమాండ్లకు సంబంధం లేదన్నారు. చర్చలకు వస్తే పాత జీతాలు వేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించేందన్నారు. వేతనాల బిల్లులు చేయకుండా డీడీవోలను అడ్డుకుంటున్నారన్నారు. హెచ్ఆర్ ఏ శ్లాబులపై నష్టం జరిగిందని భావిస్తే చర్చలకు సిద్ధం అన్నారు. ఫిట్ మెంట్ పై నిర్ణయమే కీలకం అని ఉద్యోగ సంఘాలు చెప్పాయన్నారు. ఇప్పుడు మాట మార్చి మరోలా వ్యవహరించటం తగదన్నారు. తనపై ఉద్యోగ సంఘం నేతలు చేసిన ఆరోపణలపై స్పందించేందుకు సజ్జల నిరాకరించారు. తాము సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నామని..ఉద్యోగులు అందరూ ప్రభుత్వంలో భాగమే అన్నారు.