బిజెపి ఎంపీ టీ జీ వెంకటేష్ ముఖ్యమంత్రి కెసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర విజభన ప్రకారం జరిగిన నదీ జలాల ఒప్పందాన్ని కెసీఆర్ కాదంటే తాము కూడా సమైక్యాంధ్ర ఉండాలంటామన్నారు. ఏపీ నాయకులు తెలంగాణ తీరు పై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడైనా పొరపాటు జరిగితే కొన్ని తరాలు ఇబ్బంది పడతారని తెలిపారు. టీ జీ వెంకటేష్ మంగళవారం నాడు క్రిష్ణా జలాల అంశంపై మీడియాతో మాట్లాడారు. కెసీఆర్ ను చూసి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. కరోనా వచ్చాక కెసీఆర్ వైఖరి మారిపోయిందని..ఆయన మతిమరుపుతో మాట్లాడుతున్నారని విమర్శించారు. కరోనా వచ్చిన రాష్ట్ర ప్రజలను చెక్ పోస్ట్ ల దగ్గర నిలిపివేశారరని..ఇదెక్కడి పద్దతి అన్నారు. హైదరాబాద్ పై ఏపీ ప్రజలకు పదేళ్ల పాటు హక్కు ఉందన్నారు. శ్రీశైలం పవర్ ప్రాజెక్టు అని తమ ఇష్టం వచ్చినట్లు పవర్ ఉత్పత్తి తయారు చేసుకుంటాం అని తెలంగాణ నాయకులు అనడం సిగ్గుచేటని విమర్శించారు.
విద్యుత్ ప్రాజెక్ట్ అంటూనే సాగునీటి కోసం నీళ్లు ఎందుకు వాడుకుంటున్నారో తెలంగాణ నాయకులు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక గెలవాలని కేసీఆర్ ఇలా నీటి గొడవలు మొదలు పెట్టాడన్నారు. కేసీఆర్ నవరసాలు పండించే వ్యక్తి అని.. ఉగాది పచ్చడి లా తీపి చేదు లా కేసీఆర్ మాట తీరు ఉంటుందని ఎద్దేవా చేశారు. సాగునీటి విషయంలో పాకిస్తాన్ కన్నా అన్యాయంగా కెసిఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 2015లో జరిగిన ఒప్పందంలో కెసిఆర్ ఆమోదంతో రెండు రాష్ట్రాల అధికారులు సంతకాలు చేశారని తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్రలు ఎంతగా క్రిష్ణా, గోదావరి జలాలను అక్రమంగా ఉపయోగించుకున్న నోరుతెరవని కెసీఆర్ ఏపీ విషయంలో మాత్రం నీటిని ఉపయోగించుకునేందుకు ముందు ఉంటారన్నారు.