టీడీపీ లో ఒక పేరు ఇప్పుడు పదే పదే వినిపిస్తోంది. సహజంగా తెలుగు దేశం పార్టీ అంటే అందరికి ఠక్కున గుర్తుకు వచ్చేది నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ల పేర్లే. కానీ ఇప్పుడు మూడవ పేరు కూడా తెర మీదకు వచ్చింది. పేరు తెరమీదకు రావటమే కాదు...ఇప్పుడు ఆ పార్టీ లో అదో పవర్ ఫుల్ ‘పవర్ సెంటర్’ గా మారింది అనే టాక్ మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల్లో కూడా సాగుతోంది. రాజకీయ నాయకులే కాదు..అధికార వర్గాల్లో కూడా ఈ పేరు పై విస్తృత చర్చ సాగుతోంది. ఆ పవర్ ఫుల్ వ్యక్తి పేరే కిలారి రాజేష్.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరికి అందుబాటులో ఉండటం లేదు అని చెపుతున్నారు. నారా లోకేష్ దగ్గర ఎంట్రీ కూడా అందరికి సాధ్యం కాదు. దీంతో చాలా మంది సీనియర్ నేతలు కూడా తమ విషయాలు ...తమ దగ్గర కు వచ్చిన అంశాలను కిలారి రాజేష్ కు చెప్పే పరిస్థితి వచ్చింది అని ఒక మంత్రి వెల్లడించారు.
టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా అప్పటి వైసీపీ ప్రభుత్వం స్కిల్ కేసు లో కిలారి రాజేష్ ను కూడా సిఐడి ద్వారా ఇబ్బంది పెట్టగా ఆయన కోర్టు ను ఆశ్రయించి ఊరట పొందారు. తర్వాత తన ప్రతి కదలికపై కూడా వైసీపీ ప్రభుత్వం నిఘా పెట్టింది అని అప్పటిలో కిలారు రాజేష్ ఆరోపించారు. ఇప్పడు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం కిలారి రాజేష్ అత్యంత పవర్ ఫుల్ గా మారిపోయారు అనే చర్చ అధికార పార్టీ నేతల్లో సాగుతోంది. మంత్రి నారా లోకేష్ కు కిలారి రాజేష్ ఎంతో సన్నిహితుడిగా పేరుంది. దీంతోనే ఆయన ఇప్పుడు పవర్ ఫుల్ గా మారిపోయారు అని...మంత్రి నారా లోకేష్ కూడా తన దగ్గరకు ఏ పని మీద వచ్చిన వాళ్ళను అయినా రాజేష్ ను కలిసి మాట్లాడాల్సిందిగా చెపుతున్నట్లు ఒక సీనియర్ మంత్రి తెలిపారు.
మంగళగిరిలో టీడీపీ రాష్ట్ర కార్యాలయంలోని మూడవ అంతస్థు నుంచే ఆయన చక్రం తిప్పుతున్నారు అనే ప్రచారం పార్టీ నాయకుల్లో సాగుతోంది. సహజంగా అధికారంలో ఉన్న వాళ్ళు కొత్తగా పవర్ సెంటర్లకు ఏ మాత్రం ఛాన్స్ లు ఇవ్వరు. కానీ కిలారి రాజేష్ కు మాత్రం అటు చంద్రబాబు, ఇటు నారా లోకేష్ లు కూడా అండదండలు అందించటం వెరైటీ అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. కొత్తగా రాజ్య సభ సభ్యత్వం దక్కించుకున్న సానా సతీష్ నారా లోకేష్ తో పాటు కిలారి రాజేష్ కు కూడా ఎంతో సన్నిహితుడు అని పార్టీ నాయకులు చెపుతున్నారు. ఒక్క పార్టీ లోనే కాను..ప్రభుత్వంలోని పలు శాఖల్లో కూడా కిలారి రాజేష్ పేరు తరచూ వినపడుతోంది అని అధికార వర్గాలు కూడా చెపుతున్నాయి.