ఏపీలో కొత్త నీచ సంస్కృతికి తెర‌లేపారు

Update: 2021-11-20 10:32 GMT

ఏపీ అసెంబ్లీలో శుక్ర‌వారం నాడు జ‌రిగిన ప‌రిణామాల‌పై టీడీపీ ఎమ్మెల్యే, ప్ర‌ముఖ హీరో నంద‌మూరి బాలకృష్ణ స్పందించారు. ఏపీలో ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్ర‌జ‌లు అంద‌రూ చూస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఆయ‌న శ‌నివారం నాడు హైద‌రాబాద్ లో మీడియా స‌మావేశంలో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బాలకృష్ణ వ్యాఖ్య‌లు ఆయ‌న మాట‌ల్లోనే...'ఆడవాళ్ల జోలికొస్తే చేతులు ముడుచుకుని కూర్చోం. మంచి సలహాలు ఇచ్చినా తీసుకునే పరిస్థితిలో లేదీ ప్రభుత్వం. మీరు మారకపోతే మెడలు వంచి మారుస్తాం. మంగళగిరిలో పార్టీ కార్యాలయంపై దాడి చేయించారు, చంద్రబాబుపై ఎన్నోవిధాలుగా దాడులకు ప్రయత్నించినా ఆయన సంయమనంతో ఉన్నారు. ఇకపై ఎవరు నోరు తెరిచినా ఉపేక్షించేది లేదు. ఆడవాళ్లను తెరపైకి తెచ్చి రాజకీయాల్లో మైండ్‌గేమ్‌ ఆడుతున్నారు. రాజకీయాల్లో అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు.

ఈ సంగ‌తి గుర్తించుకోవాలి. వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేశారు. అన్నింటినీ మీకు దాసోహం చేసేలా చేసుకోవడం మంచిది కాదు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలు చాలా బాధాకరం. సజావుగా సాగాల్సిన అసెంబ్లీ వ్యక్తిగత దూషణలకు వేదికైంది. ఎంతో ధైర్యంగా ఉండే చంద్రబాబు కంటతడిపెట్టుకోవటం ఎప్పుడూ లేదు. అసెంబ్లీలో సవాళ్లు, ప్రతిసవాళ్లు ఆనవాయితే. ప్ర‌జాసమస్యలపై పోరాడటమే అసెంబ్లీ వేదికగా ఉండేది. అభివృద్ధిపై చర్చకు బదులు వ్యక్తిగత అజెండా తీసుకొచ్చారు. వైకాపా నుంచి మహిళా శాసనసభ్యులు సభలో ఉన్నారు. నా సోదరి భువనేశ్వరిపై వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరం. అసెంబ్లీలో ఉన్నామో... పశువుల కొంపలో ఉన్నామో అర్థం కాలేదు. అందరి కుటుంబాల్లో ఆడవాళ్లు ఉన్నారు... హేళన చేయవద్దు. కొత్త నీచ సంస్కృతికి తెరలేపారు.. ఆ పార్టీలోనూ బాధపడే వారున్నారు. ఏకపక్షంగా సభను నడుపుతున్నారు' అంటూ బాలకృష్ణ మండిప‌డ్డారు.

Tags:    

Similar News