విభజిత ఆంధ్ర ప్రదేశ్ స్పీకర్లకు ఆ సీటు ఆ మాత్రం కలిసి రావటం లేదా?. ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర విభజన తర్వాత మొదటి సారి ఆంధ్ర ప్రదేశ్ స్పీకర్ గా సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు బాధ్యతలు చేపట్టారు. ఆయన తన ఐదేళ్ల పాలనా కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు కూడా. 2019 ఎన్నికల్లో ఆయన కూడా ఎమ్మెల్యేగా పరాజయం పాలు అయ్యారు. ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలు అయిన తర్వాత అప్పటి అధికార వైసీపీ ఆయనపై తీవ్ర ఆరోపణలు చేసింది. స్పీకర్ గా పని చేసిన ఆయన అసెంబ్లీ నుంచి ఫర్నిచర్ ను తన కొడుకు షో రూమ్ కు..తన ఇంటికి తరలించారు అనే ఆరోపణలు వచ్చాయి. అప్పటి వైసీపీ సర్కారు ఈ విషయంలో కేసు కూడా నమోదు చేసింది. అప్పటిలో ఈ విషయం రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. ఈ విషయంపై స్పందించిన కోడెల శివప్రసాద్ రావు కొంత ఫర్నిచర్ తీసుకెళ్లిన మాట నిజమేనని...వెనక్కి తీసుకెళ్లమని లేఖలు రాశానని...కాదు కూడదు అంటే ధర లెక్కించి చెల్లించటానికి కూడా సిద్ధం అని ఆయన అప్పటిలో ప్రకటించారు. తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు అని విమర్శించారు.
ఈ విషయం దుమారం రేపటంతో పాటు రకరకాల కారణాలతో కోడెల 2019 సెప్టెంబర్ 16 న ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన అప్పటిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనంగా మారింది. ఎందుకంటే కోడెల శివప్రసాద్ రావు లాంటి నాయకుడు ఆత్మహత్య చేసుకుంటారు అని ఎవరూ ఊహించలేదు. విభజన తర్వాత వైసీపీ హయాంలో రెండవసారి మరో సీనియర్ నేత తమ్మినేని సీతారాం స్పీకర్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఏకంగా తమ్మినేని సీతారాం కుటుంబం మొత్తం పరారీలో ఉన్నట్లు వచ్చిన వార్తలు కలకలం రేపుతున్నాయి. నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే భూమిని తమ్మినేని కుటంబం ఫోర్జరీ పాత్రలతో తమపేరున రాయించుకున్నట్లు వీళ్లపై కేసు నమోదు అయింది. బతికున్న వాళ్ళను చనిపోయినట్లు నకిలీ పత్రాలు సృష్టించి భూమిని తమ పేరు మీద రాయించుకున్నట్లు కేసు నమోదు అయింది. పోలీస్ లు అరెస్ట్ చేస్తారు అనే భయంతోనే తమ్మినేని ఫ్యామిలీ మొత్తం సోమవారం తెల్లవారు జామున కుటుంబంతో సహా పరారు అయ్యారు. ఒక మాజీ స్పీకర్ ఇలా భూ కబ్జా ఆరోపణల్లో ఇరుక్కోవటం ఒకటి అయితే..ఏకంగా ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం పరారు కావటం ఇప్పుడు మరింత దుమారం రేపుతోంది.
స్పీకర్ పదవి నిర్వహించిన వాళ్లకు ఇంతకంటే అవమానం ఏమి ఉంటుంది అనే చర్చ సాగుతోంది. విభజన తర్వాత ఏపీ తొలి స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఫర్నిచర్ దొంగతనం ఆరోపణలు ఎదుర్కొని ఆత్మహత్య చేసుకుంటే...ఇప్పుడు రెండవ స్పీకర్ నకిలీ పత్రాలతో భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటూ ఏకంగా కుటుంబ సభ్యులు అంతా పరారీలో ఉండటం మరో సంచలనంగా మారింది. రాజకీయ నాయకులు సెంటిమెంట్లను బాగా నమ్ముతారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా స్పీకర్ గా పని చేసిన వాళ్ళు...దేవాదాయ శాఖ బాధ్యతలు చేప్పట్టిన వాళ్ళు ఎన్నికల్లో గెలవరు అనే నమ్మకాలు బలంగా ఉండేవి. కొన్నిసార్లు ఈ సెంటిమెంట్ బ్రేక్ అయినా కూడా ఎక్కువ సార్లు మాత్రం ఆయా పదవులు చేపట్టిన వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఎక్కువే ఉన్నాయి. ఇప్పుడు వరసగా ఏపీ స్పీకర్లు గా పనిచేసిన వాళ్ళు వరసగా చిక్కుల్లో పడ్డారు.