ఏపీపీఎస్సీ ఛైర్మ‌న్ గా గౌతం స‌వాంగ్

Update: 2022-02-17 09:52 GMT

ఏపీ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కొద్ది రోజుల క్రితం వ‌ర‌కూ డీజీపీగా ఉన్న గౌతం స‌వాంగ్ ను ఏపీపీఎస్‌సీ ఛైర్మన్‌గా నియమించింది. ఇటీవ‌లే ఆయ‌న్ను ఆక‌స్మికంగా డీజీపీ ప‌ద‌వి నుంచి త‌ప్పించి జీఏడీకి రిపోర్ట్ చేయాల‌ని ఆదేశించిన విష‌యం తెలిసిందే. ఆక‌స్మికంగా త‌ప్పించ‌టం ఒకెత్తు అయితే..ఎలాంటి పోస్ట్ ఇవ్వ‌కుండా జీఏడీకి రిపోర్టు చేయ‌మ‌న‌టంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ప‌లు రాజ‌కీయ పార్టీలు కూడా స‌ర్కారు తీరును త‌ప్పుప‌ట్ట‌డ‌మే కాకుండా..సీఎం జ‌గ‌న్ ఎవ‌రినైనా అవ‌స‌రానికి ఉప‌యోగించుకుని వదిలేస్తారంటూ ప్ర‌చారం ప్రారంభించాయి.

ఇటీవ‌ల ఏపీ ఉద్యోగులు నిర్వ‌హించిన చ‌లో విజ‌య‌వాడ స‌భ విజ‌య‌వంతం అయినందునే గౌతం స‌వాంగ్ ను డీజీపీ ప‌ద‌వి నుంచి త‌ప్పించార‌ని అధికార‌వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రిగింది. ఈ స‌భ స‌క్సెస్ అవ‌టం సీఎం జ‌గ‌న్ కు మాత్రం న‌చ్చ‌లేద‌ని..అందుకే బ‌దిలీ వేటు ప‌డింద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే విమ‌ర్శ‌లు అన్నింటికి చెక్ పెట్టేలా స‌ర్కారు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు క‌న్పిస్తోంది. అత్యంత కీల‌క‌మైన ఏపీపీఎస్సీ ఛైర్మ‌న్ గా ఆయ‌న ఐదేళ్లు ప‌ద‌విలో కొన‌సాగుతారు.

Tags:    

Similar News