వైసీపీ రెబల్ ఎంపీ ఇంటికి సీఐడీ పోలీసులు

Update: 2022-01-12 05:05 GMT

ఏపీలోని అధికార వైసీపీకి స‌వాళ్లు విసురుతున్న రెబ‌ల్ ఎంపీ రఘురామకృష్ణరాజు విష‌యంలో ఊహించ‌ని ప‌రిణామం. బుధ‌వారం ఉద‌యం హైద‌రాబాద్ లోని రఘురామకృష్ణరాజు గ‌చ్చిబౌలి ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు చేరుకున్నారు. విచార‌ణ‌లో భాగంగా త‌మ ఎదుట హాజ‌రు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ పోలీసులు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. సంక్రాంతి పండ‌గ‌ను పుర‌స్క‌రించుకుని తాను గురువారం నర‌సాపురం వెళ్ళ‌నున్న‌ట్లు ఆయ‌న ఇప్ప‌టికే ప్ర‌కటించారు. రెండు రోజుల పాటు తాను నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తాన‌ని గ‌తంలోనే తెలిపారు.

చేత‌నైతే త‌న‌పై అన‌ర్హ‌త వేటు వేయించాల‌ని ఆయ‌న స‌వాల్ విసురుతున్నారు. అలా కాక‌పోతే తానే రాజీనామా చేసి అమ‌రావ‌తి ఏజెండాతో ఉప ఎన్నిక‌కు వెళ్లి విజ‌యం సాధిస్తాన‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. గ‌త కొంత కాలంగా ఆయ‌న ప్ర‌తి రోజూ మీడియా ముందుకు వ‌చ్చి ప్ర‌భుత్వ తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. పోలీసులు ఆయ‌న ఇంటికి చేరుకున్నా..ఆయ‌న తాను పూజ‌లో ఉన్నాన‌ని..కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలిపారు. రఘురామకృష్ణరాజు త‌న‌యుడు పోలీసుల‌తో మాట్లాడారు.

Tags:    

Similar News