వైజాగ్ లో గిఫ్ట్ గా దక్కించుకున్న అధికారి..ఖరీదు కోట్లలోనే

Update: 2024-11-20 05:49 GMT

అధికారంలో ఉన్న వాళ్ళు ఏది చెపితే అది చేయటం. అందులో భాగంగా తన వంతు వాటాగా తన ప్రయోజనం తాను చూసుకోవటం. ఇదే అయన స్టైల్. గత ప్రభుత్వంలో వైజాగ్ లో వందల కోట్ల రూపాయల భూకేటాయింపు వ్యవహారంలో ఆ అవినీతి ఐఏఎస్ బహుమతిగా విశాఖలో ఒక ఖరీదు అయిన విల్లా దక్కించుకున్నారు. ఆ స్వామి భూమిపోయింది కానీ...ఆ ఐఏఎస్ కాస్ట్ లీ విల్లా మాత్రం సేఫ్. ఇదే ఇప్పడు ఆంధ్ర ప్రదేశ్ అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా తెలుగు గేట్ వే .కామ్ వెలుగు లోకి తెచ్చిన సీజ్ చేసిన బిఎండబ్ల్యూ కారు ను అయన ఫ్యామిలీనే హైదరాబాద్ లో ఉపయోగించుకుంటోంది. స్మగ్లర్ల కారు ను ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న ఐఏఎస్ అధికార భార్య ఉపయోగించుకుంటున్న వ్యవహారం ఢిల్లీ వరకు చేరింది. ఈ విషయంపై అక్కడ నుంచి అధికారులు అరా తీయటం మొదలు పెట్టారు. దీంతో ప్రభుత్వం ఈ విషయంపై విచారణకు ఆదేశించి ...నివేదిక కోరినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఒక వైపు జగన్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడు...వ్యవస్థలు అన్ని దారితప్పేలా చేశాడు అని ఆరోపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ..కూటమి ప్రభుత్వం కానీ ఐఏఎస్ ల అరాచకాలను ఏ మాత్రం పట్టించుకుంటున్న దాఖలాలు లేవు అనే విమర్శలు అధికార వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. వైజాగ్ లో విల్లా కొట్టేసిన...స్మగ్లర్ కారు హైదరాబాద్ లో ఉపయోగిస్తున్న ఆయన ఏకంగా అటవీ శాఖ పరిధిలో ఉండే ఒక సంస్థ నుంచి ఏకంగా ఎనిమిది మంది సిబ్బందిని హైదరాబాద్ లో ఉపయోగించుకుంటున్నారు.

                                                        వీళ్ళు పని చేసేది హైదరాబాద్ లో ని ఐఏఎస్ ఇంట్లో...కానీ జీతాలు ఇచ్చేది మాత్రం అటవీ శాఖకు చెందిన సంస్థ. మరో విచిత్రం ఏమిటి అంటే ఇప్పుడు ఏపీ సీఎంఓ లో ఉన్న అధికారి ఒకరు ఒక శాఖ నుంచి రెండు కార్లు తెప్పించుకుని ఒక కారు ను తన భార్యకు కేటాయించటంతో పాటు మరో కారు హైదరాబాద్ కు పంపిన వ్యవహారం కూడా దుమారం రేపుతోంది. అంతే కాదు..ఆయన అంతకు ముందు పని చేసిన శాఖలో కారు కూడా సరెండర్ చేయకుండా తీసుకెళ్ళటంతో ఆ శాఖ అధికారి మరో కొత్త కారు తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అందులో ఆ ఐఏఎస్ ఇప్పుడు ఉన్నదీ సీఎంఓ లో కావటంతో కారు వెనక్కి పంపాలనే సాహసం ఆయన చేయలేదు. ఇవి అన్ని చూస్తుంటే అసలు కొంత మంది ఐఏఎస్ ల వ్యవహారాలు...గాడి తప్పిన పాలనను చంద్రబాబు కానీ..అటు మంత్రులు కానీ ఏ మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు అని చెపుతున్నారు. ప్రభుత్వ ఖర్చును గాడిన పెట్టాల్సిన సర్కారు కొంత మంది ఐఏఎస్ ల అడ్డగోలు వ్యవహారాలను నియంత్రించలేకపోతుంది అనే అభిప్రాయాన్ని కొంత మంది అధికారులు వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వంలోని కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళతో ఆ ఐఏఎస్ లకు ఉన్న లింక్ లు కూడా ప్రధాన కారణంగా ఉన్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరో రాబోయే రోజుల్లో అయినా చంద్రబాబు నాయుడు ఈ అక్రమార్క ఐఏఎస్ ల వ్యవహారాలపై దృష్టి సారిస్తారా లేక ఇలాగే వదిలేస్తారా అన్నది వేచిచూడాల్సిందే. 

Tags:    

Similar News