ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో కేవలం 16 శాతం ఎన్నికలు మాత్రమే ఏకగ్రీవంగా జరిగాయన్నారు. ఈ ఎన్నికల్లో 10890 మంది సర్పంచ్ లు, 47,500 మంది వార్డు మెంబర్లు ఎన్నికయ్యారని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా నిబద్దతో పనిచేసిందని రమేష్ కుమార్ కొనియాడారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 90 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 50 వేల మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ పక్కనపెట్టి ఉద్యోగులు పనిచేశారని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ పూర్తిగా సహకరించారని ఆయన తెలిపారు.
జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పనిచేశారని పేర్కొన్నారు. ప్రతి విడతలో 80 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొన్నారని ఎస్‌ఈసీ వెల్లడించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా జరపాలని నిర్ణయించామని..అయితే కోర్టు కేసుల కారణంగా కొన్ని ఇబ్బందులు వచ్చాయన్నారు. కోర్టు కేసులు తొలగిపోతే ఎన్నికలపై ముందుకెళతామన్నారు. మార్చి 2 నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల తరహాలోనే పట్టణ ఓటర్లు కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొనాలని కోరారు.