ఏపీలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎస్ఈసీ వార్డు వాలంటీర్లపై ఆంక్షల కొరడా ఝుళిపించింది. ఎన్నికల ప్రక్రియలో వీరు ఏ మాత్రం జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది. ఓటరు స్లిప్పుల పంపిణీతోపాటు వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గాని ఎన్నికల విధుల్లో వాలంటీర్లు ఉండకూడదన్నారు.
ఎన్నికల సమయంలో వాలంటీర్ల పై నిఘా ఉంచడంతో పాటు... వారి ఫోన్లను స్వాధీనం చేసుకోవాలి. ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందనే ఈ ఆదేశాలు ఇస్తున్నట్లు ఎస్‌ఈసీ తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా వాలంటీర్లను వినియోగిస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద భావించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొంది.