ఏపీలో పీఆర్సీ వ్యవహారం క్లైమాక్స్ కు చేరింది. ఉద్యోగులు సోమవారం నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. ఇదే అంశంపై చర్చించేందుకు ఆదివారం నాడు ఉద్యోగ సంఘం నేతలు సమావేశం అయ్యారు. ఈ తరుణంలోనే ఉద్యోగ సంఘం నేతకు మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నానిల దగ్గర నుంచి ఫోన్లు వెళ్ళాయి. సమ్మె నోటీసు వంటివి వద్దని..చర్చించుకుని సమస్యను పరిష్కరించుకుందామని కోరారు. అయితే ఉద్యోగ సంఘం నేతలు మాత్రం పీఆర్సీ జీవోలు రద్దు చేస్తేనే ప్రభుత్వంతో చర్చలు అని చెబుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం మాత్రం కొత్త పీఆర్సీపై ముందుకు వెళ్లేందుకు నిర్ణయించుకుని తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఈ మేరకు జీవోలు కూడా జారీ చేసింది. నూతన పీఆర్సీతో చాలా మందికి వేతనాలు పెరక్కపోగా..తగ్గాయని ఉద్యోగ సంఘం నేతలు విమర్శిస్తున్నారు.తమకు పీఆర్సీ వద్దని..పాత వేతనాలే కావాలంటున్నారు.
కొత్త పీఆర్సీతో వేతనాల బిల్లును ప్రాసెస్ చేయాల్సిన ట్రెజరీ శాఖ అధికారులు..సిబ్బంది కూడా ఉద్యోగుల ఉద్యమంతోనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఆర్టీసి ఉద్యోగులు కూడా వీరిని అనుసరించేంందుకు రెడీ అవుతున్నారు. ఉద్యోగ సంఘాలు అన్నీ పీఆర్సీ అంశంపై ఒక్కటై ఉద్యమబాట పట్టాలని నిర్ణయించాయి. ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కట్టుబడి ఉండాలని ఓ అంగీకారానికి వచ్చారు. దీని కోసం స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కమిటీ సమావేశం విజయవాడలో సాగుతోంది. ఈ సమావేశానికి బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ తదితరులు హాజరయ్యారు.