తెలుగు దేశంలో హాట్ టాపిక్ గా మారిన వ్యవహారం

Update: 2025-04-09 05:38 GMT
తెలుగు దేశంలో హాట్ టాపిక్ గా మారిన వ్యవహారం
  • whatsapp icon

మంత్రులు అంతా ముఖ్యమంత్రికి విదేయంగానే ఉంటారు. ఉండాలి కూడా . లేకపోతే పదవులు పోతాయి. కానీ ఆ మంత్రి సొంత ముఖ్యమంత్రికి అత్యంత విధేయంగా ఉంటూనే ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి విషయంలో కూడా అంతే విధేయత చూపిస్తున్నారు. ఇదే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార తెలుగు దేశం పార్టీ లో హాట్ టాపిక్ గా మారిన వ్యవహారం. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రస్తుత మంత్రి అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి తో పాటు అప్పటి సీఎంఓ అధికారులతో అత్యంత సన్నిహితంగా ఉంటూ తనకు కావాల్సిన పనులు అన్ని చేయించుకున్నట్లు పార్టీ వర్గాల్లో ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. ముఖ్యంగా జగన్ హయాంలో పెద్ద ఎత్తున బిల్స్ క్లియర్ చేయించుకోవటం ద్వారా లబ్ది పొందినట్లు ఆ పార్టీ వర్గాలే చెపుతాయి. అందుకు ప్రతిఫలంగా ఇప్పుడు ఆయనకు విధేయత చూపించటంతో పాటు తెర వెనక ఆయనకు కావాల్సిన పనులు చేసిపెడుతున్నారు అనే ప్రచారం టీడీపీ వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఓటమి పాలు అయినప్పటి నుంచి బెంగళూరు -విజయవాడ మధ్య రాకపోకలు సాగిస్తున్న విషయం తెలిసిందే .

                                           కొద్ది రోజుల క్రితం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి విజయవాడ నుంచి బెంగళూరు బయలుదేరారు . అదే ఫ్లైట్ లో ఏపీ కీలక మంత్రి కూడా బెంగళూరు వెళ్ళటానికి వచ్చారు. జగన్ ను చూసి ఆయన వంగి వంగి దండాలు పెట్టిన తీరు చూసి ఆ విమానంలోని ప్రయాణికులు షాక్ కు గురి అయ్యారు . మాజీ సీఎం, ఒక పార్టీ అధినేత గా ఉన్న జగన్ కలిసినప్పుడు విష్ చేయటం ...మాట్లాడటం వింతేమీ కాదు. కానీ ఆ మంత్రి అవసరానికి మించి అతి వినయం చూపిస్తూ వంగి వంగి దండాలు పెట్టిన విషయం ఆ నోటా ఈ నోటా టీడీపీ నేతలకు చేరటంతో ఇది ఇప్పుడు పార్టీ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆ మంత్రికి కాకా పట్టడంలో మాస్టర్స్ డిగ్రీ ఉండటంతో దీంతో పెద్దగా ఆయనకు వచ్చే నష్టం కూడా ఏమి ఉండదు లే అని ఒక సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News