జగన్ కు బిగ్ షాక్!

Update: 2025-07-30 04:54 GMT

జగన్ హయాంలో సాగిన ఆంధ్ర ప్రదేశ్ లిక్కర్ స్కాం కు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లిక్కర్ అమ్మకాలపై నగదు తప్ప ఎలాంటి లావాదేవీలను అనుమతించలేదు అనే విషయం తెలిసిందే. నగదు ఎందుకు తీసుకున్నారో ఇప్పుడు ఒక చోట బయటపడింది. ఈ లిక్కర్ స్కాం కు సంబంధించి పదకొండు కోట్ల రూపాయల నగదుతో కూడిన అట్టపెట్టెలను ఆంధ్ర ప్రదేశ్ సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా వీళ్ళు సోదాలు చేయగా...ఈ డబ్బు బయటపడింది. అయితే దీనికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఈ కేసు లో ఏ 40 గా ఉన్న పురుషోత్తం ఇచ్చారు అని సమాచారం.

                                                 ఈ స్కాంలో కింగ్ పిన్ గా ప్రచారంలో ఉన్న రాజ్ కేసిరెడ్డి సూచనల మేరకు 12 డబ్బాల్లో ఈ నగదును బాక్స్ ల్లో పెట్టి రంగ రెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండలంలో ఉన్న సులోచన ఫార్మ్ గెస్ట్ లో ఈ మొత్తాన్ని దాచిపెట్టారు. పురుషోత్తం వాంగ్మూలం ఆధారంగా ఈ తనిఖీలు నిర్వహించారు. రాజ్ కేసిరెడ్డి తో పాటు చాణిక్య ఆదేశాల మేరకు 2024 జూన్ లో ఈ మొత్తాన్ని ఫార్మ్ హౌస్ కు తరలించారు. ఆఫీస్ ఫైల్స్ పేరుతో నగదును ఈ పెట్టెల్లో భద్రపరిచారు. గత కొంత కాలంగా ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున దుమారం రేపుతున్న ఏపీ లిక్కర్ స్కాం లోనే ఇటీవల వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికి సిట్ ప్రాథమిక కోర్ట్ కు సమర్పించి తుది ఛార్జ్షీట్ వేయటానికి సిద్ధం అవుతున్న వేళ ఏకంగా 11 కోట్ల రూపాయల నగదు కట్టలు ఫార్మ్ హౌస్ లు దొరకటం కీలకంగా మారింది అనే చెప్పాలి.

                                    లిక్కర్ స్కాం సొమ్మును పెద్ద ఎత్తున బాక్స్ ల్లో పెట్టి ఎక్కడకు చేర్చాలో అక్కడకు చేర్చినట్లు వైసీపీ నేతల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇప్పుడు ఒక నగదు డంప్ దొరికింది. రాబోయే రోజుల్లో మరిన్ని వెలుగులోకి వస్తాయా లేక ఇప్పటికే వాటిని సర్దేశారా అన్నది తేలాల్సి ఉంది. ఈ స్కాం వెలుగులోకి వచ్చి ఇంతకాలం అయిన తర్వాత అక్కడ పదకొండు కోట్ల రూపాయల నగదును అలా ఎందుకు ఉంచారు అన్నది కూడా ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా మారింది. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ పార్టీ నేతలు అంతా అసలు తమ హయాంలో లిక్కర్ స్కాం ఎక్కడ జరిగింది అని ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో దీనికి సంబంధించి పదకొండు కోట్ల రూపాయల నగదు పట్టుపడటం అన్నది ఎంతో కీలకం కానుంది.

Tags:    

Similar News