ఏపీ సర్కరు కీలక నిర్ణయం తీసుకుంది. పలు వర్గాల నుంచి విమర్శలు రావటంతోపాటు...విద్యార్ధులు..వారి తల్లిదండ్రులు ఈ కరోనా సమయంలో పిల్లలను పరీక్షలకు ఎలా పంపాలా అని టెన్షన్ పడుతున్న వేళ సర్కారు వారికి ఊరట ఇచ్చే నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో హైకోర్టు చేసిన సూచన కూడా సర్కారుపై ప్రభావం చూపించింది. ఇంటర్‌మీడియట్ పరీక్షల నిర్వహణమీద పునరాలోచన చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, న్యాయస్థానం అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షలను వాయిదా వేస్తున్నామని ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. 'పూర్తిగా కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ పరీక్ష కేంద్రాల్లో ఆరోగ్యపరమైన అన్ని నిబంధనలూ అమలు చేస్తూ... ప్రత్యేక బృందాల పర్యవేక్షణలో ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని భావించాం. అదీగాక, పిల్లల ప్రాక్టికల్స్ పూర్తి అయ్యాయి కాబట్టి, ఇక మిగిలి ఉన్న పరీక్షల ప్రక్రియ 6 రోజులు మాత్రమే. అది కూడా రోజుకు కేవలం మూడు గంటల పరీక్షే మిగిలి ఉంది.
పిల్లల ప్రాణాలమీద, వారి భవిష్యత్తుమీద మమకారం ఉన్న ప్రభుత్వంగా సురక్షిత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం, ఇందు కోసం కనీవినీ ఎరుగని విధంగా ఏర్పాట్లు కూడా చేశాం. అయినా, దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు, ఇందుకు సంబంధించిన వార్తల పట్ల పరీక్ష రాయాల్సిన పిల్లలు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్న విషయాన్ని ప్రజాప్రభుత్వంగా పరిగణనలోకి తీసుకున్నాం. ఈ నేపథ్యంలోనే పరీక్షల నిర్వహణమీద పునరాలోచన చేయాలని రాష్ట్ర హైకోర్టు కూడా అభిప్రాయపడినందున, కోర్టు అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని, ఆ అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షల వాయిదాను ప్రకటిస్తున్నాం. ఈ పరిస్థితులు చక్కబడిన వెంటనే ఇంటర్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం కొత్త తేదీలు ప్రకటిస్తుందని కూడా తెలియజేస్తున్నాం. ఇదే విషయాన్ని రేపు హై కోర్టుకు కూడా తెలియజేస్తాం.' అన్నారు.