ఏపీలో గురువారం నుంచి ప్రారంభం కావాల్సిన గ్రూప్ 1 ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి. హైకోర్టు నాలుగు వారాల పాటు ఈ ప్రక్రియను నిలుపుదల చేయాల్సిందిగా బుధవారం నాడు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాలను డిజిటల్ విధానంలో వాల్యుయేషన్ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ పబ్లిక్ కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయని హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం పరీక్షలు జరగలేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. డిజిటల్ వాల్యూయేషన్ గురించి చివరి దశలో చెప్పారన్నారు.
అయితే నిబంధనల ప్రకారమే గ్రూప్-1 పరీక్షలు జరిగాయని, వాల్యూయేషన్ గురించి ముందుగా చెప్పాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తరపున న్యాయవాది వాదనలు హైకోర్టుకునివేదించారు. ఇక ఇరు వాదనలు విన్న హైకోర్టు మంగళవారం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. గ్రూప్-1 ఇంటర్వ్యూ ప్రక్రియపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అత్యంత కీలకమైన గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించిన వాల్యుయేషన్ ప్రైవేట్ వ్యక్తులతో చేయించటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో పిటీషన్లు దాఖలు అయ్యాయి. ఒక్కో భాష పేపర్లను ఒక్కో చోట వ్యాల్యుయేషన్ చేయించారని పిటీషనర్లు కోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంలో ఏపీపీఎస్సీ కార్యదర్శి ఏకపక్షంగా వ్యవహరించారని తెలిపారు.