మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొండపల్లి ప్రాంతంలో అక్రమ మైనింగ్ పరిశీలనకు వెళ్లిన ఆయన కారుపై రాళ్ళ దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత దళితులపై ఉమా దూషణలకు దిగటంతోపాటు దాడి చేశారనే ఆరోపణలతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టు ముందు హాజరు పర్చగా 14 రోజుల రిమాండ్ కు ఆదేశించారు. దీంతో ఉమాను జైలుకు తరలించిన విషయం తెలిసిందే.
బెయిల్ కోసం ఉమా కోర్టును ఆశ్రయించగా..ఇరువైపులా వాదనలు విన్న ఏపీ హైకోర్టు బుధవారం నాడు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇంకా ఈ కేసులో కొంత మందిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని..ఈ తరుణంలో ఆయనకు బెయిల్ మంజూరు చేయవద్దని ప్రభుత్వం కోర్టును కోరింది. అయితే ఇది పూర్తిగా ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసు అని ఉమా తరపు లాయర్లు కోర్టు కు నివేదించారు. మంగళవారం నాడు వాదనలు పూర్తికాగా..బుధవారం నాడు తీర్పు వెలువడింది.