ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సంవత్సరం కొత్తగా ఆరు వేల పోలీసు నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. దీంతోపాటు ఇతర శాఖల్లో భర్తీ చేయాల్సిన ఉద్యోగాలకు సంబంధించి ఉగాది నాటికి క్యాలెండర్ సిద్ధం చేయాలన్నారు. దీంతోపాటు విద్యా శాఖకు సంబంధించి కూడా జగన్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. అటానమస్ కాలేజీల్లో పరీక్షల విధానంలో మార్పులు చేసింది. ప్రభుత్వ యూనివర్శిటీల్లో సిద్ధం చేసే ప్రశ్నాపత్రాలనే అటానమస్ కాలేజీల్లోనూ ఉపయోగించాలన్నారు. ఈ మేరకు వెంటనే నిర్ణయాన్ని అమలు చేయాలన్నారు.
విద్యార్ధులు డిగ్రీలు సాధించిన తర్వాత ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండాలన్నారు. నైపుణ్యం లేకుండా ఇంటర్వ్యూలు కూడా ఎదుర్కోలేమని.. ప్రతి విద్యార్థీ నైపుణ్యంతో, సబ్జెక్టుల్లో పరిజ్ఞానంతో ముందుకు రావాలన్నారు. ప్రతికోర్సుల్లో అప్రెంటిస్ విధానం తీసుకురావాలని అందుకే నిర్ణయించామని సీఎం పేర్కొన్నారు. అదే సమయంలో ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు వీలైనంత త్వరగా నిధులను విడుదల చేయాలని సీఎం ఆదేశించారు.