ఏపీ సర్కారు అనూహ్య నిర్ణయం ప్రకటించింది మూడు రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకుంది. ఈ మేరకు ఏపీ అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు నివేదించారు. ఎవరూ ఊహించని రీతిలో ప్రభుత్వం అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అత్యవసర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అసెంబ్లీలో సీఎం జగన్ దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితం వరకూ కూడా ఆరు నూరైనా మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గేదిలేదని ప్రకటిస్తూ వచ్చిన సర్కారు ఎందుకు ఆకస్మికంగా ఈ నిర్ణయం తీసుకుందని అన్నది రాజకీయ, అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఏమైనా మార్పులతో కొత్త బిల్లులు తెస్తారా? లేదా అన్నది వేచిచూడాల్సిందే. మరి మూడు రాజధానులపై వెనక్కి పోతే ఇంత కాలం చెబుతూ వచ్చిన అభివద్ధి వికేంద్రీకరణ నినాదం ఏమి అవుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. అంతే కాదు అమరావతి కేవలం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు అంటూ వచ్చారు. అంతే కాదు..ఇక్కడ గ్రాఫిక్స్ తప్ప ఏమీ లేవు అంటూ కూడా మంత్రులు పదే పదే వ్యాఖ్యానించారు. అమరావతి విషయంలో గత ప్రభుత్వంపై వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది.