ప్రభుత్వ పాలసీకి తూట్లు పొడిచి మరీ అదనపు రాయితీలు

Update: 2025-12-15 09:40 GMT

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల సేవ కంటే ఎక్కువగా కార్పొరేట్ల సేవలోనే ఎక్కువ తరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక వైపు ఎడా పెడా ప్రభుత్వ భూములు కారు చౌకగా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడమే కాకుండా కంపెనీలు ఎంత కోరితే అంత మేర రాయితీలు ఇవ్వటానికి కూడా ఏ మాత్రం వెనకాడటం లేదు. అది కూడా తాను తెచ్చిన విధానాన్ని తానే తుంగలో తొక్కి మినహాయింపులు ఇస్తూ మరీ బడా కార్పొరేట్స్ కు కొమ్ముకాస్తోంది చంద్రబాబు సర్కారు. చంద్రబాబు సర్కారు ఇస్తున్న భారీ భారీ రాయితీలు చూస్తుంటే పేద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ను ధనిక రాష్ట్రం అయిన ఆంధ్ర ప్రదేశ్ ఆదుకున్నట్లు ఉంది అని ఒక ఐఏఎస్ అధికారి వ్యంగ్యాస్త్రాలు సాధించారు.

                              రిలయన్స్ ఇండస్ట్రీస్ గత ఆర్థిక సంవత్సరంలో అంటే 2024 -2025 కాలానికి ఏకంగా 81,309 కోట్ల రూపాయల నికర లాభం సాధించింది. మరో వైపు చంద్రబాబు సర్కారు నెల గడవటాని కి క్రమం తప్పకుండా అప్పులు చేస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఆర్ సి పీఎల్) ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా ఓర్వకల్ లో కార్బొనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసులు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తయారీ కోసం సమగ్ర తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీని కోసం కంపెనీ 1622 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. ఈ పెట్టుబడి ద్వారా 1200 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని అంచనా వేశారు. ఇందుకు గాను కంపెనీ తమకు 602 కోట్ల రూపాయల మేర టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలని కోరింది.

                                              దీంతో ప్రభుత్వం కూడా ఫుడ్ ప్రోసెసింగ్ పాలసీ అనుమతించకపోయినా కూడా రిలయన్స్ సంస్థకు ఆ కంపెనీ కోరినట్లు రాయితీలు ఇవ్వటానికి ఓకే చేసింది. ఈ ప్రతిపాదనను ఎస్ఐపీబి ముందు పెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి నిర్ణయాన్ని జాగ్రత్తగా పరిశీలించి ‘ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ (4.0) 2024-29’ ప్రకారం, కంపెనీ అభ్యర్థన మేరకు మొత్తం స్థిర మూలధన పెట్టుబడి (FCI)లో 37.10 శాతం అయిన రూ.601.87 కోట్ల వరకు టైలర్-మేడ్ ప్రోత్సాహకాలను మంజూరు చేయడానికి ప్రభుత్వం ఆమోదించింది. ఈ ప్రోత్సాహకాలు ‘ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ (4.0) 2024-29’లో ఉన్న అర్హత లేని నిబంధనను ప్రత్యేకంగా సడలిస్తూ, ఐదు సంవత్సరాల కాలవ్యవధిలో ఇవి చెల్లించటానికి ఆమోదించారు. అది కూడా కంపెనీ కోరిన మొత్తంలో ఎక్కడా ఒక్క రూపాయి కూడా తేడా రాకుండా ఎంత అడిగిందో అంత ఇచ్చేశారు. ఈ మేరకు తాజాగా ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది.

Tags:    

Similar News