చంద్రబాబు విడుదల చేసిన శ్వేత పత్రంలో లేని కేశవ్ పేరు

Update: 2024-07-26 04:51 GMT

కానీ అసెంబ్లీ లో కేసులు ఉన్నట్లు నిలుచున్న మంత్రి

పయ్యావుల కేశవ్. ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి. ఆయన ఇప్పుడు సొంత పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తో పాటు అసెంబ్లీని కూడా మోసం చేశారు అనే చర్చ టీడీపీ వర్గాల్లో సాగుతోంది . అది ఎలాగా అంటారా?. గురువారం నాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ హయాంలో ఉన్న శాంతి, భద్రతల పరిస్థితిపై శ్వేత పత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన సమయంలోనే చంద్రబాబు నవ్వుతూ సభలో ఉన్న వాళ్లలో ఎంత మందిపై కేసు లు ఉన్నాయో ఒక సారి నిలుచోవాలని కోరారు. ఆ సమయంలో కేసు లు ఉన్న జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు కేసు లు ఉన్న వాళ్ళు అందరూ నిలుచున్నారు. ఇక్కడ విశేషం ఏమిటి అంటే...అందరితో పాటు ఆర్థిక శాఖ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా లేచి నిలుచున్నారు. కానీ చంద్రబాబు విడుదల చేసిన శ్వేత పత్రంలో ఉన్న నాయకుల జాబితాలో ఎక్కడా పయ్యావుల కేశవ్ పేరు మాత్రం లేదు. చంద్రబాబు ప్రకటించిన శ్వేత పత్రంలో మొత్తం 54 పేర్లు ఉంటే..అందులో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల పేరు కూడా ఉంది. కానీ ఎక్కడా పయ్యావుల కేశవ్ పేరు మాత్రం లేదు. ముఖ్యమైన రాజకీయ నేతలపై నమోదు అయిన కేసులు, నాటి ప్రతిపక్ష ముఖ్యనేతలపై నమోదు అయిన కేసు లు అంటూ రెండు పేజీల్లో నేతలు పేర్లు ఉన్నాయి. వాటిలో ఎక్కడా ఆర్థిక మంత్రి పేరు లేదు. కానీ చంద్రబాబు కేసు లు ఉన్న వాళ్ళు నుంచోమని కోరగానే కేశవ్ కూడా లేచి వెనక నిలుచున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారా అని చూశారు.

                                                విచిత్రం ఏమిటి అంటే స్వయంగా పార్టీ అధినేత, ముఖ్యమంతి చంద్రబాబు నాయుడు వెల్లడించిన జాబితాలోనే ఆయన పేరు ఎక్కడా లేదు. ఈ లెక్కన వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆయనపై ఒక్కటంటే ఒక్క కేసు కూడా నమోదు కాలేదు అని తేలిపోయినట్లు అయింది. కానీ చంద్రబాబు మాత్రం పయ్యావుల కేశవ్ కు అత్యంత కీలకమైన ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పదవి ఇచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు జాబితా ప్రకారం చూస్తే పయ్యావుల కేశవ్ అటు చంద్రబాబును, శాసనసభను, రాష్ట్ర ప్రజలను కూడా తనపై కేసు లు ఉన్నట్లు మోసం చేసినట్లే అని ఒక టీడీపీ నాయకుడు వ్యాఖ్యానించారు. వాస్తవానికి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పయ్యావుల కేశవ్ పార్టీ కోసం పని చేసింది మూడు నుంచి ఐదు నెలలు మించి ఉండదు అని పార్టీ వర్గాలే చెపుతున్నాయి. చంద్రబాబు విడుదల చేసిన కేసు ల జాబితా కూడా చెపుతోంది కేశవ్ పార్టీ కోసం ఎంత గట్టిగా పోరాడారో. మరి పోరాడివాళ్లకే మంత్రి పదవులు అనే వాదనను పయ్యావుల విషయంలో చంద్రబాబు ఎలా సమర్ధించుకుంటారో. ఇక్కడ కీలక మైన విషయం ఏమిటి అంటే అత్యంత కీలకమైన శాసన సభా, ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రిగా ఉండి సభను ..సభా నాయకుడిని కూడా ఒక మంత్రి తప్పుదోవ పట్టించటం దారుణం అనే చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News