
కొద్ది రోజుల క్రితం పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపాయి. మొన్నటి ఎన్నికల్లో తాము నిలబడటమే కాకుండా...నలభై ఏళ్ళ టీడీపీ ని కూడా నిలబెట్టాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి అప్పటిలో రాజకీయంగా పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. పిఠాపురం ఆవిర్భావ సభలో చేసిన దానికి భిన్నంగా ఇప్పుడు రివర్స్ లో మన దగ్గర సత్తా లేనందునే 2014 నుంచి చంద్రబాబు నాయుడి కి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు జనసేన నాయకులు..క్యాడర్ ను షాక్ కు గురిచేశాయి అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ మాటలు చూస్తే రాజకీయంగా జనసేన కు ఇది దారుణ దెబ్బగా చెపుతున్నారు. పవన్ కళ్యాణ్ ఛాన్స్ దొరికినప్పుడల్లా మరో పదిహేను సంవత్సరాలు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటారు అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదే చాలా మంది జనసేన నాయకులు...క్యాడర్ కు ఏ మాత్రం రుచించటం లేదు. ఇప్పుడు ఏకంగా సత్తా లేనందునే చంద్రబాబు కు మద్దతు ఇచ్చినట్లు చెప్పటం అంటే ఇంతకు మించిన సెల్ఫ్ గోల్ మరొకటి ఉండదు అని ఒక జనసేన నాయకుడు అభిప్రాయపడ్డారు.
పవన్ కళ్యాణ్ మాటలు చూస్తుంటే అపరిచితుడు సినిమా గుర్తు వచ్చేలా ఉంది అన్నారు ఆయన. ఆదివారం నాడు అమరావతి లో జరిగిన పీ 4 సమావేశంలో పవన్ కళ్యాణ్ మాటలు ఆయన వ్యాఖ్యల్లోనే...‘నేను 2014 నుంచి కూడా ఏమీ ఆశించకుండా నారా చంద్రబాబు నాయుడికి ఎందుకు మద్దతు ఇచ్చాను అంటే మన దగ్గర సత్తాలేనప్పుడు..అది ప్రజలకు ఉపయోగపడే సత్తా కానీ,బలం కానీ...సమర్ధత, తెలివి తేటలు, ప్రతిభ ఒక నాయకుడి దగ్గర ఉన్నప్పుడు ఓట్లు చీలకుండా ఇస్తే అది ప్రజలకు ఉపయోగపడుతుంది అని . 2014 నుంచి నేను అదే పని చేశాను. 2024 లో కూడా ఎందుకింత బలంగా ఉన్నాను అంటే ఆయనే కనుక ఈ రోజు అధికారంలో , ముఖ్యమంత్రిగా లేకపోయి ఉంటే ఈ రోజున పీ 4 పాలసీ, జీరో పావర్టీ పాలసీ బయటకు వచ్చేది కాదు. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని దిశా, నిర్దేశం చేసి దాన్ని బయటపడేయగల సత్తా ఉన్న శక్తి చనిపోయేది. అందుకే మనస్ఫూర్తిగా ఎన్డీయే కూటమి నాయకులుగా..కష్టాల్లో ఉన్న రాష్ట్రంలో మా అందరికి మార్గదర్శకత్వం వహిస్తూ చంద్రబాబు నాయుడి వెనక ఉన్నాం.’ అని ప్రకటించారు.
స్వర్ణాంధ్ర 2047 విధానం తో రాష్ట్రం అనుకున్న లక్ష్యం సాధించగలదు అన్నారు పవన్ కళ్యాణ్ . రాబోయే తరాల కోసం ఆలోచించే వ్యక్తి కాబట్టే తాము అంతా చంద్రబాబు వెనక నిలబడ్డామన్నారు. పీ 4 విషయంలో ప్రభుత్వం పూనుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది అని చెప్పారు . కానీ పీ 4 లో ప్రభుత్వ జోక్యం ఏమీ ఉండదు అని ..ప్రైవేట్ వ్యక్తుల సాయంతోనే ఇది చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా ప్రకటించారు. ప్రభుత్వం కేవలం దాతలు, లబ్ధిదారుల మధ్య అనుసంధానకర్తగా మాత్రమే ఉంటుంది అని తెలిపారు. అయినా సరే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం ప్రభుత్వం పూనుకుంటే బాగుంటుంది అని చెప్పటం విశేషం.